తొలి రోజు 40 శాతం విద్యార్థులు హాజరు : మంత్రి సబిత
Minister Sabitha Indra Reddy About Students Attendance. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలోని హైదరాబాద్
By అంజి Published on 1 Sept 2021 2:27 PM ISTతెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు రీ ఓపెన్ అయ్యాయి. ఈ నేపథ్యంలోని హైదరాబాద్ నగరంలోని విజయనగర్ కాలనీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో కరోనా నిబంధనలు ఎలా పాటిస్తున్నారని స్కూల్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. లాక్‌డౌన్ తర్వాత ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు తెరవడం జరిగిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. తొలి రోజు స్కూళ్లకు 30 నుంచి 40 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారాని, కోవిడ్ నిబంధనలు పాటించాలని విద్యార్థులకు తల్లిదండ్రులు పదే పదే చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. కరోనా నిబంధనలు పాటిస్తూ తరగతులను రన్ చేస్తున్నామన్నారు.
దాదాపు 17 నెలల తర్వాత స్కూళ్లు ఓపెన్ కావడంతో.. గ్రామాల్లో సర్పంచ్‌లు, మున్సిపాలిటీల్లో చైర్మన్ల ఆధ్వర్యంలో రాష్ట్రంలోని అన్ని స్కూళ్లలో క్లీనింగ్, శానిటైజేషన్ చేయించామని మంత్రి సబిత తెలిపారు. స్కూళ్లు తెరవడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. గతంలో కంటే ఇప్పుడు విద్యార్థులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రధానోపాద్యాయులకు, టీచర్లకు మంత్రి సబిత ఆదేశాలు ఇచ్చారు. ప్రతి రోజు తరగతులు ప్రారంభం అయ్యే ముందు చేసే ప్రేయర్‌లో విద్యార్థుల కరోనా నిబంధనలపై అవగాహన కల్పించాలన్నారు. మధ్యాహ్న భోజన సమయంలోనూ విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకునేవిధంగా చర్యలు చేపట్టాలన్నారు. హ్యాండ్ వాష్, సోషల్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తూ భోజనం చేయాలని మంత్రి సబితా తెలిపారు. జిల్లా విద్యాశాఖ అధికారుల కో-ఆర్డినేట్ చేసుకుంటూ పాఠశాలలొ ప్రధానోపాద్యాయులు విద్యాబోధన జరిగేలా చూడాలన్నారు.