భారీ వర్షాలు..ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు.

By Knakam Karthik
Published on : 13 Aug 2025 10:28 AM IST

Telangana, Minister Rajanarsimha , Telangana Health Department, Heavy Rains

భారీ వర్షాలు..ఆరోగ్యశాఖ అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు

రాష్ట్రంలో ఇవాళ్టి నుంచి మూడ్రోజుల పాటు భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ సూచించారు. ఈ మేరకు బుధవారం ఉదయం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి టెలీకాన్ఫరన్స్ నిర్వహించారు. హాస్పిటళ్ల సూపరింటెండెంట్లు, ఆర్‌ఎంవోలు, మెడికల్ ఆఫీసర్లు, డాక్టర్లు, సిబ్బంది ఈ మూడు రోజులు కచ్చితంగా హాస్పిటల్స్‌లోనే ఉండాలన్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అందరి సెలవులు రద్దు చేయాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు‌. అత్యవసర పరిస్థితుల్లో‌ వచ్చే రోగులకు, గర్భిణులకు తక్షణమే వైద్య‌ సేవలు అందించాలని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ దగ్గరగా ఉన్న గర్భిణులను హాస్పిటల్స్‌లోని బర్త్ వెయిటింగ్ రూమ్స్‌కు తరలించి సేవలందించాలన్నారు. అంబులెన్స్‌లు, 102 వాహనాలు అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, ఎక్కడ ఎమర్జెన్సీ ఉన్నా తక్షణమే వెళ్లి పేషెంట్‌ను తరలించేలా‌ డ్రైవర్లు, ఈఎంటీలను 24 గంటలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. హాస్పిటళ్లలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, పవర్ కట్ అయిన మరుక్షణమే జనరేటర్స్ ప్రారంభించి రోగులకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఎలక్ట్రీషియన్లను 24 గంటలు హాస్పిటల్‌లో అందుబాటులో ఉంచుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో హాస్పిటల్స్‌ లోపలికి నీరు చేరకుండా, నిల్వ ఉండకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులంతా ఈ మూడు రోజులు క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి, అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Next Story