ఆర్టీసీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందని సమ్మె విరమించుకోవాలని ఆర్టీసీ సంఘాలకు తెలంగాణ రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్‌లో ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ అబ్రహం తదితరులు మంత్రిని కలిశారు. కార్మికుల సమస్యలను మంత్రికి వివరించి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం వారికి భరోసా ఇచ్చారు.
మరోవైపు సమ్మె ఆలోచనను విరమించుకోవాలని ఆర్టీసీ సిబ్బందికి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఉద్యోగులకు బహిరంగ లేఖ రాసింది. తల్లిలాంటి ఆర్టీసీని కాపాడుకునేందుకు సహకరించాలని కోరింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ‘‘ప్రభుత్వ సహకారంతో సమస్యలు పరిష్కరించుకుందాం. సంస్థ ఇప్పుడిప్పుడే కోలుకుని అభివృద్ధి పథంలోకి వెళ్తోంది. 2019లో జరిగిన సమ్మె వల్ల సంస్థ సంక్షోభంలోకి వెళ్లింది. ఒక వర్గం మనుగడ కోసం చెప్పే మాటలకు ప్రభావితం కావొద్దు. ఎస్మా చట్టం ప్రకారం ఆర్టీసీలో సమ్మెలు నిషేధం. సమ్మె పేరుతో ఉద్యోగులను ఎవరైనా బెదిరించినా.. విధులకు ఆటంకం కలిగించినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవు’’అని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించింది.