ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ధరణి సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్‌లో ప్రజావాణికి ప్రజలు రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, ధరణిపై విధివిధానాలు సిద్ధం చేస్తామన్నారు. అవి సిద్ధం అయ్యాక ఉన్న చోటు నుంచే సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు. ప్రజాభవన్‌లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ప్రజలు 5,234 దరఖాస్తులను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. 10 ఏళ్ల నుంచి బంగారు తెలంగాణ చేశామని గత ప్రభుత్వం చెప్పిందని, ప్రజల సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజావాణికి ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఎలా వస్తున్నాయి అని ప్రశ్నించారు.
అటు హైదరాబాద్‌లో ప్రతి మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చే వారు ఉదయం 10 గంటలలోపే రావాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 1 గంట వరకు వినతులు స్వీకరిస్తామని, అందుకోసం 10 గంటల లోపు వచ్చిన వారిని ప్రజాభవన్ లోపలికి అనుమతిస్తామని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటుచేశారు. ఇదిలా ఉంటే.. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి పొన్నం అన్నారు. ఆటో వాళ్ళు తమ సోదరులే అని... వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. ఆటో వారి విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని.. అప్పటి వరకు కొంచెం ఓపికగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.