ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం : మంత్రి పొన్నం

కింది స్థాయి నుండి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు

By Kalasani Durgapraveen  Published on  7 Oct 2024 3:29 PM IST
ప్రజా పాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాం : మంత్రి పొన్నం

కింది స్థాయి నుండి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన లో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తుందన్నారు. ఇప్పటికే పాఠశాలలో రూ.1100 కోట్లతో 25 వేల స్కూల్ లకు మౌలిక సదుపాయాలు కల్పించాం అన్నారు. గత 10 సంవత్సరాలుగా బదిలీలు, ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న టీచర్లకు 19 వేల ప్రమోషన్లు, 35 వేల బదిలీలు చేపట్టాం అన్నారు. ప్రతి స్కూల్ కి ఉచిత విద్యుత్, డ్రింకింగ్ వాటర్, శానిటేశన్ కి ప్రత్యేక నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు.గత దశాబ్ద కాలంగా నిరుత్సాహం లో ఉన్న మోడల్ స్కూల్ టీచర్లకు కూడా బదిలీలు, ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్కూల్ లో 9 వేల నియామకాలు చేపట్టాం అన్నారు. డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాల నమూనా విడుదల చేశారు.

ఇంటర్నేషనల్ స్కూల్ లో ఉన్న మాదిరి వసతి సౌకర్యాలతో కూడిన భవనాలకి ఈ నెల 11న శంఖు స్థాపన చేస్తామన్నారు. ఈ సంవత్సరానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ భవనాలకు 5 వేల కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. పిల్లలు గురుకుల పాఠశాలలకు రావడానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రంలో గురుకులాల్లో 98 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందన్నారు. 326 గురుకుల పాఠశాలలో 21 మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి.. మిగిలినవి అద్దె భవనాల్లో కొనసాగతున్నాయన్నారు. గురుకులాల్లో చెత్త, గడ్డి లేకుండా ఉండడానికి ఉపాధి హామీ ద్వారా శుభ్రపరచాలని కలెక్టర్ లకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

Next Story