ప్రతి బస్‌స్టేషన్‌లో అలా చేయండి, ఆర్టీసీ అధికారులకు మంత్రి ఆదేశం
ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
By - Knakam Karthik |
ప్రతి బస్‌స్టేషన్‌లో అలా చేయండి, ఆర్టీసీ అధికారులకు మంత్రి ఆదేశం
హైదరాబాద్: ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారికి రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. హైదరాబాద్‌లో ప్రధాన రద్దీ ప్రాంతాలైన ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాలకు ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ప్రతి బస్ స్టేషన్ లోనూ ప్రత్యేక అధికారిని నియమించాలని, అక్కడ రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలి. ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలతో పాటు ఉన్నతాధికారులందరూ క్షేత్రస్థాయిలో ఉంటూ.. 97 డిపోలు 340 బస్ స్టేషన్లు సమన్వయం చేసుకొని ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చాలని ఆదేశించారు.
దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 7754 స్పెషల్ బస్సులను టీజీఎస్ఆర్టీసీ నడుపుతున్నట్లు తీసుకెళ్లిన ఆర్టీసీ ఉన్నతాధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కాగా సద్దుల బతుకమ్మ ఈ నెల 30న, దసరా అక్టోబర్ 2న ఉన్నందున.. ఈ శనివారం నుంచే సొంతూళ్లకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముండటంతో ఆ మేరకు ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచామని అధికారులు వివరించారు.