కరువు పరిస్థితులపై బీఆర్ఎస్ రాజకీయం చేస్తుంది : మంత్రి పొన్నం
బీఆర్ఎస్ పార్టీ వర్షపాతాన్ని, కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
By Medi Samrat Published on 27 March 2024 11:17 AM GMTబీఆర్ఎస్ పార్టీ వర్షపాతాన్ని, కరువుకు సంబంధించిన అంశాన్ని రాజకీయం చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2020 లో వర్షపాతం ఎంత..? 2023లో వర్షపాతం ఎంత.? కరువుకు బీఆర్ఎస్ కారణం అంటలేము.. కాంగ్రెస్ కూడా కారణం కాదు. వర్షాలకు ప్రకృతి కారణం.. దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని విమర్శించారు.
హరీష్ రావు మాజీ మంత్రి కాగానే వాస్తవాలకు భిన్నంగా మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్ వచ్చిన తరువాత కరువు రాలేదు.. అరేబియాలో ఏర్పడిన ఎల్ నినో కారణంగా వర్షపాతం తగ్గిందన్నారు. గతంలో 1091.8 MM వర్షపాతం నమోదైంది.. ఈసారి చాలా తక్కువ వర్షపాతం నమోదైందవి వివరించారు. గత సంవత్సరం వర్షాలు తక్కువగా పడ్డాయని పేర్కొన్నారు.
డబుల్ బెడ్రూంలు కట్టి ఇచ్చిన లబ్దిదారులను మీరు ఓట్లు అడగండి.. ఇందిరమ్మ ఇళ్లు ఉన్న ఊర్లలో మేము ఓట్లు అడుగుతామన్నారు. 5 ఎకరాల లోపు ఉన్న వారికి రైతు బంధు పడింది.. మిగిలిన వారికి కూడా వేస్తామన్నారు. టీఆర్ఎస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పాలైందన్నారు. గతంలో రైతు బంధు మార్చ్ నెల వరకూ వేశారు. 40 వేల కోట్ల పనులు బకాయిలను కాంగ్రెస్ పార్టీ పైన పెట్టిందన్నారు.
అధికారం నుండి వెళ్ళేటప్పటికి 7 లక్షల కోట్ల అప్పులు చేయడంతో పాటు 40 వేల కోట్ల బకాయిలు పడింది. హాస్టల్ లో ఉన్న పిల్లలకు మెస్ బిల్లులు కూడా చెల్లించలేకపాయింది. పంట భీమా పథకం పెట్టక పోవడం వల్ల రైతులకు నష్టం జరుగుతుందన్నారు. పంటల భీమా పథకం పెట్టీ ఉంటె రైతులు చనిపోయే వారు కాదు కదా అని అడిగారు.
రైతులకు మద్దతు ధరలు, కొనుగోలు కేంద్రాలు ఇలా ఏదీ ఉన్నా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కోర్టు తీర్పు ఇస్తే కూడా మీరు రైతులకు నష్టపరిహారం ఎందుకు చెల్లించలేదని ప్రశ్నించారు. ప్రభుత్వాలు కలిసి పని చేయాలి. మీరు ప్రధాని వచ్చినా కలిసే పరిస్థితి లేదు. అధికారం, పార్టీలతో సంబందం లేదు.. కేంద్రంతో సత్సంబంధాలు నడిపి కేంద్రం నుండి రావాల్సిన వాటాను తప్పకుండా తీసుకుంటామన్నారు. మెట్రో, మూసీ, తాగు నీటి సమస్య .. తదితర అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు.
మిషన్ భగీరథ ద్వారా 100 శాతం నీరు ఇచ్చామని కేంద్రానికి నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఎక్కడికక్కడ ఇళ్లకు నీళ్ళు లేని పరిస్థితి నెలకొందని.. తాగు నీటికి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా కాపాడుతూ సప్లయ్ చేస్తున్నామని వివరించారు. ఎన్నికల కోసం సీఎస్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని వివరించారు.
కాంగ్రెస్ రాగానే కరువు తెచ్చిందన్న మూర్ఖులకు చెబుతున్నా.. రైతాంగం నష్ట పరిహారంకి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. రైతు బంధు ఇచ్చిన వాళ్ళని మేము ఓట్లు అడుగుతాం.. ఇవ్వని వాళ్ళని మీరు ఓట్లు అడగండని సవాల్ విసిరారు. కాళేశ్వరం కృంగిపోయింది.. మీ హయాంలో జరిగిన ప్రాజెక్ట్ ఏం జరిగిందో కూడా చెప్పలేదన్నారు. నష్టం ఏంటి అనేది చెప్పకుండా కుట్ర కోణం దాగి ఉందని కేసు పెట్టారు. మరి కుట్ర కోణం ఎందుకు బయట పెట్టలేదు.. ప్రాజెక్ట్ మానస పుత్రిక.. మీది చెడిపోతే మా బాధ్యతనా.. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఆర్టీసీలో 35 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 కే గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాల్లో రేషన్ కార్డులు ఇవ్వలేదు. మేము రేషన్ కార్డులు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నామని.. ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని పేర్కొన్నారు. నియంతృత్వంగా పాలించిన మీరు ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కూడా కాకముందే కూలిపోతుందని అపశకునాలు పెడుతున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండని పిలుపునిచ్చారు.
ఆర్టీసీని నాశనం చేసింది మీరు.. మేము ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొస్తున్నామన్నారు. టెట్ అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు. ఎక్కడ సమస్యలు లేకుండా పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోన్ ట్యాపింగ్ నిందితులపై చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామన్నారు. పోన్ ట్యాపింగ్ చేయడం చట్ట విరుద్ధం.. అలా చేసి కొందరు రాక్షసానందం పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు.