ప్రజా దర్బార్‌ను జిల్లాలకు విస్తరిస్తాం : మంత్రి పొన్నం

తుక్కుగుడ విజయభేరీ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీల్లో రెండు అమలు చేశామ‌ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

By Medi Samrat  Published on  10 Dec 2023 8:51 AM GMT
ప్రజా దర్బార్‌ను జిల్లాలకు విస్తరిస్తాం : మంత్రి పొన్నం

తుక్కుగుడ విజయభేరీ సభలో సోనియా గాంధీ ఇచ్చిన 6 హామీల్లో రెండు అమలు చేశామ‌ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాంధీ భవన్ లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. తొమ్మిది వేలకు పైగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామ‌ని.. ప్రతి రోజు 45 లక్షల మంది మహిళలు ప్రయాణం చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు. నా శాఖ పరిధిలోకి వస్తుంది కాబట్టి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి, సీఎం రేవంత్ కు ఉన్న కమిట్ మెంట్ కి నిదర్శనం రెండు గ్యారంటీల అమలు అని వివ‌రించారు.

గత పాలనలో ప్రజలకు సెక్రటేరియట్, ప్రగతి భవన్ లోకి అనుమతి లేకుండా పోయింది.. వాటిని పూర్తిగా మార్చామ‌న్నారు. ప్రజల సమస్యలు వినడానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామ‌ని తెలిపారు. ఈ కార్యక్రమంను జిల్లాలకు విస్తరిస్తామ‌ని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఏకఛత్రాధిపత్యంగా ఉండదన్నారు. ఆటో డ్రైవర్ ల బాధల గురించి చర్చిస్తాం.. వారి డిమాండ్‌ల‌ను పరిగణలోకి తీసుకుంటామ‌న్నారు. అన్ని సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు. ఆర్టీసీ విలీన పక్రియలో ఆస్తులు వేరు వేరుగా పెట్టారు. రద్దు అయిన సంఘాలను కూడా చర్చలకు ఆహ్వానిస్తాం. వారి సూచనలు, సలహాలు తీసుకుంటాం. ఆర్టీసీని నిర్వీర్యం కాకుండా కాపాడుకుంటామ‌ని తెలిపారు.

Next Story