బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరతీశారు: మంత్రి పొన్నం
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు.
By Srikanth Gundamalla Published on 27 Feb 2024 2:50 PM ISTబండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరతీశారు: మంత్రి పొన్నం
కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ విజయసంకల్ప యాత్ర పేరుతో కాంగ్రెస్‌పై అబద్ధాలు ప్రచారం చేస్తోందని ఆయన చెప్పారు. బండి సంజయ్ యాత్రలో రాజకీయ డ్రామాలకు తెర లేపారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్‌ని తాను ప్రశ్నించానని.. కానీ ఆయన దాన్ని తప్పుగా ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అనర్నారు. ఐదేళ్ల పదవి కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని మాత్రమే అన్నానని చెప్పారు. శ్రీరాముడి పేరు మీద ఓట్లు అడగడం కాదు.. నిజంగా ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేసినట్లు మంత్రి పొన్నం తెలిపారు.
శ్రీరాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి తాను మాట్లాడలేదని మంత్రి పొన్నం చెప్పారు. ఇక బండి సంజయ్ ఇష్టంవచ్చినట్లుగా తన తల్లి జన్మకు సంబంధించిన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఇది ఎంతవరకు సరైనదని నిలదీశారు. రాజకీయంగా డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు బండి సంజయ్ యాత్రకు కాంగ్రెస్ అడ్డుపడుతోందనీ.. దాడులు చేశారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తాము ఎవరి యాత్రలను అడ్డుకోవడం లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కు ఎవరికైనా ఉందన్నారు. భార్య మంగళసూత్రాన్ని అమ్మి ఎన్నికల్లో గెలిచానంటూ బండి సంజయ్ చెబుతారని.. అలాంటి వ్యక్తికి శ్రీరాముడంటే ఎంత గౌరవం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు.
ఇలాంటి వ్యాఖ్యల పట్ల బీజేపీ కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలని పొన్నం ప్రభాకర్ అన్నారు. తాము హింసావాదులం కాదనీ చెప్పారు మంత్రి పొన్నం. శవం మీద పేలాలు ఏరుకునే వారు నాయకులు చాలా మంది ఉన్నారు.. అలాంటి వారం కాదన్నారు. ఇక నుంచైనా బండి సంజయ్ జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు. ఇక ముందు తనపై తప్పుడుగా వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.
బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరతీశారు: మంత్రి పొన్నం pic.twitter.com/Dql5r4uYHf
— Newsmeter Telugu (@NewsmeterTelugu) February 27, 2024