ప్రతి దరఖాస్తును స్వీకరించండి : మంత్రి పొంగులేటి
ప్రభుత్వానికి కళ్ళు, చెవులు ప్రభుత్వ అధికారులేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
By Medi Samrat Published on 26 Dec 2023 7:16 PM ISTప్రభుత్వానికి కళ్ళు, చెవులు ప్రభుత్వ అధికారులేనని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ.. డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకూ పని దినాలలో ప్రజాపాలన గ్రామ, వార్డు సభల నిర్వహణ ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు షిఫ్టులలో ప్రజాపాలన గ్రామసభల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. మహాలక్ష్మీ, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత పథకాలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించాలని సూచించారు.
ప్రతి మండలంలో అవసరమైన మేర బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తుదారులు ముందుగానే దరఖాస్తు నింపుకొని గ్రామ సభకు వచ్చేలా చర్యలు చేపట్టాలని.. ప్రతి దరఖాస్తును స్వీకరించాలని ఆదేశించారు. ప్రతి దరఖాస్తుదారునికి 5 నిమిషాల నుండి 10 నిమిషాలు కేటాయించాలన్నారు.
ప్రజా పాలన కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైందన్నారు. అధికారులు బాధ్యతయితంగా పని చేయాలని.. దరఖాస్తు దారునికి రూపాయి ఖర్చు లేకుండా చూడాలని.. జిరాక్స్ సెంటర్ లలో కూడా ఎక్కువ మొత్తం వసూలు చేయకుండా చూడాలని ఆధికారులను ఆదేశించారు.
ప్రజా పాలన కార్యక్రమానికి తగినన్ని కౌంటర్లు, ఏర్పాటు చేయాలని.. బాధ్యతాయుతమైన అధికారిచే రశీదు అందజేయాలని.. అనంతరం ప్రతి ధరఖాస్తు వివరాలు కంప్యూటర్ లో నమోదు చేయాలని సూచించారు.