తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ నెల 5న ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఓపెన్
ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్టు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
By అంజి Published on 3 Dec 2024 7:10 AM ISTతెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఈ నెల 5న ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఓపెన్
హైదరాబాద్: ప్రతి నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వనున్నట్టు రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 5వ తేదీన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన యాప్‌ను ఓపెన్ చేస్తామన్నారు. ప్రతి గ్రామానికి అధికారుల బృందాలు వస్తాయని పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేస్తామన్నారు.
''సరిగ్గా సంవత్సరం క్రితం మార్పు కావాలని , ఇందిరమ్మ ప్రభుత్వం కోసం భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు దీవించారు. గత సంవత్సర కాలంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేసుకుంటున్నాం. మరో పది రోజుల లోపే పేదలందరికీ న్యాయం జరిగే విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదలుపెట్టుకోబోతున్నం'' అని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
నేలకొండపల్లి మండల పర్యటనలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల వరకే రాజకీయాలు, ఆతర్వాత అభివృద్ధి పైనే దృష్టి అని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలు నమ్మరని, రైతును రాజును చేయాలని అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టారని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అన్నీ అమలు చేస్తున్నామన్నారు. రూ.2800 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ కి విడుదల చేశామన్నారు. మొత్తంగా 21 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామన్నారు.
ఆనాడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు 250 రూపాయలు బోనస్ ఇచ్చిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని, ఈనాడు 500 బోనస్ ఇస్తున్నామన్నారు. సంక్రాంతి తరువాత రైతు భరోసా ఇస్తామన్నారు.