భూధార్ కార్డుల పంపిణీపై మంత్రి కీలక ప్రకటన

'భూభారతి' విధానంలో కఠినమైన నియమ నిబంధనలను పొందుపరిచామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

By -  Knakam Karthik
Published on : 4 Dec 2025 7:32 AM IST

Telangana, Bhu Bharati, Bhudar Cards, Ponguleti Srinivasreddy, Congress Government

భూధార్ కార్డుల పంపిణీపై మంత్రి కీలక ప్రకటన

తెలంగాణలో భూరికార్డుల నిర్వహణను మరింత పారదర్శకంగా.. పటిష్టంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదించిన 'భూభారతి' విధానంలో కఠినమైన నియమ నిబంధనలను పొందుపరిచామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ధరణి పోర్టల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించడానికి, భూవివాదాలు న్యాయస్థానాలకు వెళ్లకుండా నివారించడానికి ఉద్దేశించిన అంశాలను వివరించారు.

ధరణి పోర్టల్‌లో గత ప్రభుత్వం దాచిన అనేక 'సీక్రెట్ లాకర్ల ను' కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెరిచి.. భూరికార్డుల సమస్యలను వెలికి తీసినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇప్పటివరకు వచ్చిన 9 లక్షల ఫిర్యాదులలో చాలా వరకు న్యాయపరమైన అంశాలు ఉన్నవాటిని పరిష్కరించామని పొంగులేటి తెలిపారు. ఈ చారిత్రక ఫిర్యాదుల పరిష్కార ప్రక్రియ భూభారతి ద్వారా మరింత సులభతరం కానుంది. భూభారతిని రూపొందించడంలో తమ లక్ష్యం.. ప్రతి చిన్న విషయానికి భూవివాదాలు కోర్టులకు వెళ్లకుండా అడ్మినిస్ట్రేటివ్ స్థాయిలో పరిష్కారం చూపించడమేనని మంత్రి స్పష్టం చేశారు.

'భూభారతి విధానంలో అత్యంత కీలకమైన అంశం భూధార్ కార్డుల జారీ. భూమికి సంబంధించిన సమగ్ర వివరాలు కలిగిన ఈ కార్డులు లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. సమగ్ర సర్వే ద్వారా అన్ని భూములను అధికారిక రికార్డుల్లోకి ఎక్కించిన తర్వాత.. స్థానిక సంస్థల ఎన్నికలు (సర్పంచ్ ఎన్నికలు) పూర్తయిన వెంటనే గ్రామాల్లో భూధార్ కార్డులను పంపిణీ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఎవరి పేరుపై భూమి రిజిస్టర్ అయి ఉంటుందో వారికి ఈ కార్డులను పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ పరిరక్షణ కోసం ఉద్దేశించిన జీవో 111 పరిధిలో కూడా ప్రభుత్వం చట్టబద్ధంగానే వ్యవహరిస్తుందని.. ఈ ప్రాంతాల అభివృద్ధిపై త్వరలోనే స్పష్టమైన నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. చివరగా.. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేసిన మంత్రి, నిజం నిలకడ మీద తెలుస్తుందని స్పష్టం చేశారు. భూరికార్డుల విషయంలో పారదర్శకత కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్నారు.

Next Story