ప్రజా సేవకులుగా వారి కష్టాలను తీరుస్తాం: మంత్రి పొంగులేటి
గతంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందనీ.. అలాగే పేదల సమస్యలను అస్సలు పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి అన్నారు.
By Srikanth Gundamalla Published on 2 Jan 2024 7:05 AM GMTప్రజా సేవకులుగా వారి కష్టాలను తీరుస్తాం: మంత్రి పొంగులేటి
గతంలో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడిందనీ.. అలాగే పేదల సమస్యలను అస్సలు పట్టించుకోలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా మంగళగూడెంలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. గత ప్రభుత్వ పాలనతో తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ఎంతో నష్టపోయిందని అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని మంత్రి పొంగులేటి ఆరోపించారు. అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వంర నిబద్ధతతో పనిచేస్తోందనీ.. రోజుకు 16 గంటల పాటు చిత్తశుద్ధితో తాము పనిచేస్తున్నట్లు మంత్రి పొంగులేటి అన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని అన్నారు పొంగులేటి. రూ.6.71 లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పారు. ప్రజాధనంతో గతంలో సీఎం భవనాలను నిర్మించుకుని విలాసవంతంగా గడిపారని విమర్శించారు. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది చెప్పారు. తాము ముందే చెప్పినట్లుగానే ఆరు గ్యారెంటీలను తొలి మంత్రి వర్గ సమావేశంలోనే ఆమోదించామన్నారు. దాంతో.. తమ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటనేది అర్థమవుతోంది వెల్లడించారు. అలాగే.. ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామన్నారు. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.
ప్రజాసేవకులుగా ఉన్నామనీ.. ప్రజల కష్టాలు తీరుస్తామని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగుతోందని చెప్పారు. ప్రజా సమస్యలను తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిత్యం కృషి చేస్తుందని మంత్రి పొంగులేటి చెప్పారు.