ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు..గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త పాలసీ ప్రకటించిన మంత్రి

పేదలకు సొంత ఇంటిపై గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త పాలసీని మంత్రి పొంగులేటి ప్రకటించారు.

By -  Knakam Karthik
Published on : 9 Dec 2025 3:50 PM IST

Telangana, Hyderabad, Ponguleti Srinivasreddy, Telangana Global Summit

ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు..గ్లోబల్ సమ్మిట్‌లో కొత్త పాలసీ ప్రకటించిన మంత్రి

తెలంగాణలోని ప్రతి కుటుంబం ఉన్నతమైన ప్రమాణాలతో నివసించేందుకు అనువైన సొంత ఇంటి వసతిని కల్పించాలన్నది ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ , సమాచార పౌర సంబంధాల‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలకు అనువుగా ఉండే ధరల్లో ఉండేట్లుగా ఒక సమగ్ర విధాన రూపకల్పనకు తెలంగాణా రైజింగ్ 2047 – గ్లోబల్ సమ్మిట్ చక్కటి వేదిక. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా మంగళవారం నాడు ‘అఫర్డ్ బుల్ హౌసింగ్ పాలసీ ఫర్ అర్భన్ ఫ్యూచర్ – తెలంగాణా మోడల్ 2047’ అనే అంశంపై జరిగిన సదస్సులో మంత్రి కీలక ఉపన్యాసం ఇచ్చారు.

పెరుగుతున్న పట్టణీకరణతో పాటు, విస్తృతమవుతున్న గృహ అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశానికి ఆదర్శంగా ఉండేలా ఆర్థికంగా సాధ్యమైన, పర్యావరణ పరిరక్షణకు అనుగుణమైన, సాంకేతికత ఆధారిత అంశాలు ఉండేలా సమగ్రమైన పాలసీని రూపొందిస్తున్నామని వివరించారు. తెలంగాణా సమగ్ర అభివృద్ధి కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించనున్న విధానాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రోల్ మోడల్ గా నిలుస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

రాష్ట్రం లో ఇప్పటివరకు అమలైన గృహ కార్యక్రమాల ద్వారా సాధించిన పురోగతిని వివరిస్తూ గతంలో ఇందిరమ్మ పథకం ద్వారా సుమారు 42 లక్షల ఇండ్లను నిర్మించగా, ఇప్పడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో సుమారు 3.5 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయని తెలిపారు. అంతే కాకుండా మధ్య తరగతి కుటుంబాల కోసం హౌసింగ్ బోర్డ్, రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ తదితర సంస్థల ద్వారా సుమారు ఒక లక్ష ఇళ్లు నిర్మించినట్లు వివరించారు. రాష్ట్రంలో గృహాల డిమాండ్ మరియు సరఫరా మధ్య భారీ అంతరం ఉందని, ఈ అంతరాన్ని పూడ్చడానికి, వ్యక్తిగత పథకాలకు పరిమితం కాకుండా, ప్రభుత్వ లక్ష్యానికి మూలస్తంభం లాంటి తెలంగాణ- 2047ను ఆదాయంతో సంబంధం లేకుండా ఒక సమగ్ర గృహ నిర్మాణ విధానాన్నిరూపొందిస్తున్నామని ప్రకటించారు.

పట్టణ ప్రాంతాల అవసరాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, సమతుల్యతతో కూడిన "గృహ నిర్మాణ తెలంగాణ నమూనా 2047" వైపు చారిత్రక అడుగు వేస్తున్నాం. ఈ నమూనా తప్పనిసరిగా ఆర్థికంగా లాభదాయకంగా, సామాజికంగా సమ్మిళితంగా, పర్యావరణపరంగా బాధ్యతాయుతంగా, సాంకేతికత ఆధారితంగా ఉండాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ప్రభుత్వ ప్రవేట్ భాగ్యస్వామ్యంతో ఔటర్ రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్డు మధ్యలో పేద మధ్యతరగతి ప్రజల కోసం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ తరహాలో ఇళ్ల ను నిర్మించాలన్న ఆలోచన చేస్తున్నాము. తెలంగాణను మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజించి వ్యూహాలను రూపొందించామని తెలిపారు.

తెలంగాణను మూడు ప్రధాన ప్రాంతాలుగా విభజన

తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం (TCUR)మురికివాడల యథాస్థితి పునరాభివృద్ధి, ఐటీ కారిడార్లలో అందుబాటు అద్దె గృహ నిర్మాణం.. రవాణా కారిడార్ల వెంబడి గృహాల ఏర్పాటు.. పరి-అర్బన్ ప్రాంతం (PUR)ప్లాన్డ్ టౌన్‌షిప్‌లు.. భారత్ సిటీ వంటి గ్రీన్‌ఫీల్డ్ శాటిలైట్ టౌన్‌లు, పారిశ్రామిక ప్రాంతాలలో కార్మికుల గృహ వసతి, రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలు (RoS)చిన్న/మధ్య తరహా టౌన్‌షిప్‌లు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ హబ్‌లతో అనుసంధానించబడిన అద్దె/కార్మికుల గృహ నిర్మాణం ప్ర‌ధాన వ్యూహాలుగా త‌యారుచేశాం.

అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సమగ్రమైన అఫర్డ్ బుల్ హౌజింగ్ పాలసీ ఆవశ్యకత చాలా ఉన్నదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్తగా రూపొందించనున్న అఫర్డబుల్ హౌసింగ్ పాలసీలో ఇటీవల ప్రకటంచిన క్యూర్, ప్యూర్, రేర్ జోన్లకు అనుగుణంగా అనుసరించాల్సిన విధానాలను నిర్దేశించనున్నామని వెల్లడించారు.

Next Story