గుడ్‌న్యూస్: నేడు వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించనున్న ప్రభుత్వం
తెలంగాణలో చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు.
By Knakam Karthik
గుడ్‌న్యూస్: నేడు వారికి ఇందిరమ్మ ఇళ్లు అందించనున్న ప్రభుత్వం
తెలంగాణలో చెంచులకు ఇందిరమ్మ ఇళ్లను అందిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి ప్రకటించారు. నేడు నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజకవర్గం మన్ననూరులో చెంచులకు ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరగనుందని వెల్లడించారు. రాష్ట్రంలోని ఉట్నూరు, భద్రాచలం, మున్ననూర్, ఏటూరు నాగారం నాలుగు సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్ధ (ఐటిడిఎ)ల పరిధిలోని 21 నియోజకవర్గాలలో సచ్యురేషన్ పద్దతిలో 13,266 చెంచు కుటుంబాలను ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నామని ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.
గిరిజన ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పలు సందర్బాలలో సూచించడం జరిగిందని అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనేక సందర్బాలలో గిరిజన ప్రాంతాలలో అభివృద్ది, ముఖ్యంగా వారి నివాస గృహాల నిర్మాణంపై అనేక సూచనలు చేశారని గవర్నర్ , ముఖ్యమంత్రి సూచనలు సలహాల మేరకు గిరిజన ప్రాంతాల్లో చెంచులకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. మొదటి విడతలో భాగంగా సోమవారం నాడు అచ్చంపేట నియోజకవర్గం మున్ననూర్‌లో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ తో కలిసి చెంచులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను స్వయంగా తానే అందజేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరు నిర్మాణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఐటీడీఏ పీవోను నోడల్ అధికారిగా నియమిస్తున్నాం’’ అని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు.