రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుంది: మంత్రి నిరంజన్‌ రెడ్డి

Minister niranjan reddy fires on central govt. వరి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

By అంజి  Published on  13 Nov 2021 12:57 PM IST
రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుంది: మంత్రి నిరంజన్‌ రెడ్డి

వరి ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని తెలపాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. రైతు పోరాటంతో కేంద్రం దిగిరావాల్సిందేనన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒకటి చెబుతోంది.. రాష్ట్ర బీజేపీ నేతలు మరొకటి చెబుతున్నారని అన్నారు. ఇది దివాలాకోరు రాజకీయమంటూ మంత్రి నిరంజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టిన నిరసన విజయవంతం అయ్యిందని అన్నారు. ఈ సందర్భంగా రైతులకు ధన్యవాదాలు తెలిపారు. రైతులను ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వాలు అధికారానికి దూరమయ్యాయని అన్నారు.

గతంలో ఇబ్బంది పెట్టిన ప్రభుత్వాలను రైతులు కఠినంగా శిక్షించారని పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలతో రైతుల మెడపై కత్తి వేలాడుతోందని మండిపడ్డారు. రైతులను బాధపెట్టే ప్రభుత్వాలకు ఉసురు తగులుతుందన్నారు. దేశంలో కోట్ల మందికి తిండి గింజలు లేవని.. ధాన్యం నిల్వలను పేదలకు పంచొచ్చని వెల్లడించారు. రైతుల బాగు కోసం కేంద్ర ప్రభుత్వానికి వేల కోట్లు ఖర్చు చేసే శక్తి లేదా అంటూ ప్రశ్నించారు. సామాన్య పౌరుల డబ్బులను కార్పొరేట్లకు పంచుతున్నారని ఆరోపించారు.

నూనె గింజల ఉత్పత్తిని పెంచాలని తాము కృషి చేస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం వంట నూనెల దిగుమతి వేల కోట్లు ఖర్చు చేస్తోందని విమర్శించారు. నూనె గింజల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వానాకాలం పంట సాగు చేశామని అన్నారు. ఆ నివేదికను కేంద్రానికి పంపామని వెల్లడించారు. వ్యవస్థలన్నీ కేంద్రం చేతుల్లోనే ఉన్నాయన్నారు. కేంద్రం కొత్త మార్గలు అన్వేషించకుండా రైతులను గోస పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story