ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారు : మంత్రి మల్లారెడ్డి
Minister Malla Reddy press meet after IT Raids.ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు.
By తోట వంశీ కుమార్ Published on 24 Nov 2022 12:43 PM ISTఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారని తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రెండు రోజుల పాటు మంత్రి మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడులపై గురువారం ఉదయం మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. బీజేపీ కుట్రలో భాగంగానే ఐటీ దాడులు జరిగాయన్నారు. తన పేరు, ప్రతిష్టలు డ్యామేజ్ చేయాలనే దాడులు చేశారని ఆరోపించారు.
బీజేపీ కుట్రలు పన్నుతోందని సీఎం కేసీఆర్ ముందే మాకు ధైర్యం చెప్పారన్నారు. "65 బృందాలతో నాపై, నా కుటుంబసభ్యులపై ఐటీ శాఖ దాడులు చేసింది. రెండు రోజుల పాటు మా కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. మా ఇంట్లో, కొడుకులు, అల్లుడు, మా కళాశాల, ప్రొఫెసర్, టీచర్, క్లర్స్ ఇళ్లలో చేసిన సోదాల్లో రూ.28 లక్షలు దొరికాయి. 30 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా. ఇంజినీరింగ్ వ్యవస్థను తీసుకువచ్చింది నేనే అని గర్వంగా చెబుతా. ఇంజినీరింగ్ వ్యవస్థ అంటే మల్లారెడ్డి గుర్తొచ్చేలా తీర్చిదిద్దాం. అక్రమాలు, దౌర్జన్యం మాకు అలవాటు లేదు. ఐటీ సోదాలు నాకేం కొత్త కాదు. గతంలో కూడా జరిగాయి. అయితే.. ఇంత దౌర్జన్యం జీవితంలో ఎప్పడూ చూడలేదు" అని మంత్రి మల్లారెడ్డి చెప్పారు.
ఐటీ అధికారులు నమ్మించి మోసం చేశారని మల్లారెడ్డి మండిపడ్డారు. తన ఇంట్లో సోదాలు పూర్తి అయిన తరువాత తనతో, తన చిన్న కుమారుడితో సంతకాలు చేయించుకున్నారని తెలిపారు. తన పెద్ద కొడుకుకు సంబంధించి కూడా రిపోర్ట్ తయారు చేశారని, ఆయనతో సంతకం చేయించుకోవడానికి వెళ్తుంటే ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, ఆసుపత్రిలో ఉన్నారని, తన కొడుకు తరపున కూడా తానే సంతకం పెడతానని చెప్పగా అందుకు ఐటీ అధికారులు అంగీకరించారన్నారు.
తరువాత తనను మోసం చేశారని తెలిపారు. నాన్నతో ఐటీ అధికారులు సంతకం చేయించుకుంటున్నారని ఆసుపత్రి నుంచి తన మనవరాలు తనకు ఫోన్ చేసి చెబితే తాను షాక్ కు గురయ్యానని తెలిపారు. తన కొడుకుతో దౌర్జన్యంగా సంతకం చేయించుకున్నట్లు ఆరోపించారు. ఆ పేపర్లలో ఏముందో కూడా చదవకుండా సంతకం పెట్టేశాడని అన్నారు.