బీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి రాగం ఎత్తుకున్నారు ఎమ్మెల్యేలు. మేడ్చల్ మల్కాజ్‌గిరికి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, వివేక్ మైనంపల్లి, బేతి సుభాష్ రెడ్డి లు మంత్రి మల్లారెడ్డిపై నిరసన గళం విప్పారు. ఆయన ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నామని వాపోయారు. మైనంపల్లి నివాసంలో సమావేశమైన ఐదుగురు నేతలు తిరుగుబావుటా ఎగురవేయడం బీఆర్ఎస్ పార్టీలో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది.
దీనిపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. మాది క్రమశిక్షణ గల పార్టీ. ఇది కుటుంబ సమస్య. మాకు కుటుంబ పెద్దలు ఉన్నారు. మేము ఈ సమస్యను పరిష్కరించుకుంటామని చెప్పారు. తాను గాంధేయవాదినని, ఎవరితోనూ గొడవలు పడనని చెప్పారు. పదవులు ఇచ్చేది ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ తప్ప తాను కాదన్నారు.
అవసరం అయితే తానే ఎమ్మెల్యే ఇంటికి వెలుతా, లేదా వారినే మా ఇంటికి ఆహ్వానిస్తానని చెప్పారు. తామంతా అన్నదమ్ముల్లా ఉంటున్నామన్నారు. కావాలనే కొందరు దీన్ని పెద్దది చేసి చూపుతున్నారని మల్లారెడ్డి అన్నారు.