మోదీజీ.. ఆ ప‌ని చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి : మంత్రి కేటీఆర్‌

Minister KTR Tweet on Bilkis Bano Case Issue.బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషుల‌ను స్వాతంత్య్ర

By తోట‌ వంశీ కుమార్‌  Published on  17 Aug 2022 1:06 PM IST
మోదీజీ.. ఆ ప‌ని చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి : మంత్రి కేటీఆర్‌

బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో 11 మంది దోషుల‌ను స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున గుజ‌రాత్ ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డంపై టీఆర్ఎస్ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ మండి ప‌డ్డారు. రెమిష‌న్ విధానం కింద ఖైదీల‌ను విడుద‌ల చేసిన‌ట్లు గుజ‌రాత్ ప్ర‌భుత్వం పేర్కొన్న నేప‌థ్యంలో.. ఆ ఆదేశాల‌ను ర‌ద్దు చేయాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ని మంత్రి కోరారు.

స్వాతంత్య్ర దినోత్స‌వం రోజున ప్ర‌ధాని జాతినుద్దేశించి ప్ర‌సంగిస్తూ మ‌హిళ‌ల గురించి చేసిన వ్యాఖ్య‌ల‌ను ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. "మహిళలను గౌరవించాలంటూ మీరు చెప్పే మాటలపై చిత్తశుద్ధి ఉంటే గుజరాత్ ప్రభుత్వం రెమిషన్ ఆర్డర్ పై జోక్యం చేసుకోవాలి. ఆ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయించి, దేశం పట్ల మీకున్న చిత్తశుద్దిని నిరూపించుకోవాలి. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో తగిన సవరణలు చేసి రేపిస్టులకు బెయిల్ రాకుండా చేయాలని" మంత్రి కేటీఆర్ ట్విట్ట‌ర్ వేదిక‌గా డిమాండ్ చేశారు.

ఇదీ కేసు నేప‌థ్యం..

ఐదు నెల‌ల గ‌ర్భిణిగా ఉన్న బిల్కిస్ బానో అనే మ‌హిళ‌పై 2002లో సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డంతో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఏడుగురిని దారుణంగా హ‌త‌మార్చారు. చ‌నిపోయిన వారిలో బిల్కిస్ మూడున్న‌రేళ్ల కుమార్తె కూడా ఉంది. ఈ కేసులో 11 మందికి న్యాయ‌స్థానం జీవిత ఖైదు విధించింది. అయితే.. వారిని గుజ‌రాత్ ప్ర‌భుత్వం రెమిష‌న్ విధానం కింద విడుద‌ల చేసింది. దీనిపై పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Next Story