K అంటే కాలువలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు : కేటీఆర్‌

Minister KTR speech in Khammam tour.రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేసీఆర్(KCR) పేరుకు కొత్త అర్థం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  11 Jun 2022 1:50 PM IST
K అంటే కాలువలు, C అంటే చెరువులు, R అంటే రిజర్వాయర్లు : కేటీఆర్‌

రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్.. కేసీఆర్(KCR) పేరుకు కొత్త అర్థం చెప్పారు. కే(K) అంటే కాలువ‌లు, సి(C) అంటే చెరువులు, ఆర్‌(R) అంటే రిజ‌ర్వాయ‌ర్లు అంటూ వివ‌రించారు. మంత్రి కేటీఆర్ ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. ల‌కారం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన‌ను మంత్రి పువ్వాడ అజ‌య్‌తో క‌లిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 11.75 కోట్ల‌తో తీగ‌ల వంతెన‌ను నిర్మించారు. మ్యూజిక‌ల్ ఫౌంటైన్, ఎల్ఈడీ లైటింగ్‌ను ప్రారంభించారు. ర‌ఘునాథపాలెంలో రూ. 2 కోట్ల‌తో నిర్మించిన ప్ర‌కృతి వ‌నాన్ని ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేటీఆర్ ప్ర‌సంగించారు.

ఒక్క రోజులో రూ.100 కోట్ల‌తో నిర్మించిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు ఈ రోజు ఖ‌మ్మంలో ప్రారంభించుకోవ‌డం సంతోషంగా ఉంద‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. గ‌తంలో మురికి కూపంగా ఉన్న ల‌కారం చెరువును అద్భుతంగా అభివృద్ధి చేశార‌న్నారు. ల‌కారం చెరువు వ‌ద్ద‌ తీగ‌ల వంతెనను ఏర్పాటు చేయ‌డంతో రోజుకు 2 వేల మంది అక్క‌డికి వ‌చ్చి ఆహ్లాదంగా గ‌డుపుతున్న‌ట్లు కేటీఆర్ చెప్పారు. ఖ‌మ్మం కార్పొరేష‌న్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి మ‌రో కార్పొరేష‌న్‌లో జ‌ర‌గ‌డం లేదని, ఖ‌మ్మం న‌గరాన్ని నెంబ‌ర్‌వ‌న్‌గా మార్చాల‌న్న‌ది మంత్రి పువ్వాడ అజ‌య్ కుమార్ ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. న‌గ‌ర అభివృద్ధిని చూడ‌లేక కొంద‌రు అసూయ‌తో లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు.

ఇక‌.. మ‌న దేశంలో ఏం జ‌రుగుతుందో యువ‌త ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌పంచ దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతుంటే బీజేపీ పాల‌న‌లో దేశం వెన‌బ‌డిపోతుంద‌ని అంటూ విమ‌ర్శించారు. బీజేపీ నాయ‌కులు నోరు విప్పితే వివాద వ్యాఖ్య‌లు చేయ‌డం త‌ప్ప ఇంకేమీ మాట్లాడ‌డం లేద‌న్నారు. బీజేపీ మతరాజకీయాలను ప్రోత్సహిస్తు పబ్బం గడుపుకుంటోందని ఎద్దేవా చేశారు. భారత్ లో 25 కోట్ల మంది ముస్లింలు ఎందుకు ఆందోళన చేయాల్సిన పరిస్థితులు వచ్చింది అని మంత్రి ప్రశ్నించారు.

1987లో భార‌త‌దేశం ఆర్థిక ప‌రిస్థితి, చైనా ఆర్థిక ప‌రిస్థితి స‌మానంగా ఉంద‌ని, అయితే.. ఈ 35 ఏండ్ల త‌ర్వాత చూస్తే.. చైనా 16 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో ముందుకు దూసుకుపోయిందన్నారు. మ‌నం మాత్రం 3 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో వెనుక‌బ‌డిపోయామ‌ని చెప్పారు. పేద‌ల సంక్షేమం, దేశ పురోగతి, అభ్యున్న‌తి, ఎదిగిన దేశాల‌తోనే మా పోటీ అని చైనా ప్ర‌క‌టించి, అభివృద్ధిపై దృష్టి సారించి.. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్‌గా ఎదిగింద‌న్నారు. మ‌న‌కేమో కుల పిచ్చి, మ‌త పిచ్చి ఎక్కువైపోయిందని, దీంతో అభివృద్ధి అడుగంటి పోయిందన్నారు.

Next Story