వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
Minister KTR Slams Rajagopalreddy. మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ విమర్శలు గుప్పించారు
By Medi Samrat Published on 10 Oct 2022 9:15 PM IST
మునుగోడు బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ మాట్లాడుతూ.. రాజగోపాల్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం, కాంట్రాక్టుల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ఎమ్మెల్యేగా బీజేపీ అభ్యర్థి అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ తప్పుడు వాగ్దానాలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని కేటీఆర్ అన్నారు.
నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న టీఆర్‌ఎస్ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక.. నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవానికి, రాజగోపాల్‌రెడ్డి అహంకారానికి మధ్య జరుగుతున్న పోటీ అని అన్నారు. ఇది రాజ్‌గోపాల్ రెడ్డి సంపదకు, మునుగోడు ప్రజల సంకల్ప బలానికి మధ్య పోరు అని ఆయన అన్నారు. మునుగోడు ఉపఎన్నిక కేవలం బిజెపి అభ్యర్ధికి సంపదపై ఉన్న అత్యాశ వల్లే జరుగుతోందని, కోట్ల విలువైన కాంట్రాక్టులు దక్కించుకున్నారని అన్నారు. ఈ సందేశాన్ని నియోజకవర్గంలోని ప్రజలకు చేరవేయాల్సి ఉందన్నారు.
రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారని ఆరోపించారు. బీజేపీ అభ్యర్థి రాజకీయ వ్యాపారవేత్త అని అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో కూడా తాను కాంట్రాక్టర్ల బిల్లుల సమస్యలను లేవనెత్తేవాడని, ప్రజల సమస్యలపై ఏనాడూ నోరు మెదపలేదన్నారు.
గతంలో రాజగోపాల్ రెడ్డి ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేసినా ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు బీజేపీ కాంట్రాక్టుల ద్వారా వచ్చిన కమీషన్ సొమ్ముతో రాజ్‌గోపాల్‌రెడ్డి బైక్‌లు, కార్లు, ఇతర విలువైన వస్తువులను అందజేసి ఓటర్లను ప్రభావితం చేస్తున్నారన్నారు. అయితే మునుగోడు ప్రజలు రాజ్‌గోపాల్‌రెడ్డికి ఉప ఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారని కేటీఆర్ అన్నారు.