ఎన్డీఏలో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా?: కేటీఆర్‌

ఎన్డీఏలో చేరేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నించారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

By అంజి  Published on  4 Oct 2023 6:30 AM IST
Minister KTR, PM Modi, CM KCR, Telangana

ఎన్డీఏలో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా?: కేటీఆర్‌

నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎన్‌డిఎ)లో చేరేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నించారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ మంగళవారం నాడు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీ అబద్ధాల గురించి విరుచుకుపడిన కేటీఆర్.. సినిమాలకు స్క్రిప్ట్‌లు రాయాలని సూచించారు. "అతను (ప్రధాని మోడీ) గొప్ప స్క్రిప్ట్ రైటర్, కథకుడు అవుతాడు. ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకోవచ్చు" అని కేటీఆర్ అన్నారు.

అంతకుముందు తెలంగాణలో ఎన్నికల సందర్భంగా నిజామాబాద్‌లో జరిగిన ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ.. కేసీఆర్ ఎయిర్‌పోర్టుకు వచ్చి తనను అట్టహాసంగా రిసీవ్ చేసుకునేవారని, ఎంతో గౌరవంగా ఉండేవారని అన్నారు.

''ఇంతకుముందెన్నడూ చెప్పని రహస్యం ఒకటి చెబుతాను. జీహెచ్ఎంసీ ఎన్నికల(2020) అనంతరం కేసీఆర్ దిల్లీ వచ్చి, నన్ను కలిశారు. చాలా ప్రేమను చూపించారు. మీ నేతృత్వంలో దేశం ప్రగతిపథంలో నడుస్తోంది, ఎన్డీఏలో చేరుతామని కోరారు. నేను తిరస్కరించా'' అని మోదీ సభలో చెప్పారు.

ప్రధాని మోదీ వ్యాఖ్యలపై స్పందించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ప్రధాని ‘అబద్దాలకోరు’ అని, అందుకే బీజేపీని ‘అతిపెద్ద ఝూట్ ఫ్యాక్టరీ’గా పిలుస్తారని అన్నారు .

" హమే పాగల్ కుత్తే నే కతా హై జో హమ్ ఎన్డీఏ మే జా కే హమ్ షామిల్ హో జాయే? (ఎన్డీఏలో చేరేందుకు మాకేమైనా పిచ్చి కుక్క కరిచిందా) ఈరోజుల్లో అన్ని పార్టీలు ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నాయి. శివసేన మిమ్మల్ని (ఎన్డీఏ) విడిచిపెట్టింది. జనతాదళ్ (యు) మిమ్మల్ని విడిచిపెట్టింది. తెలుగుదేశం మిమ్మల్ని విడిచిపెట్టింది. శిరోమణి అకాలీదళ్ మిమ్మల్ని విడిచిపెట్టింది. ఇప్పుడు మీతో పాటు ఎవరున్నారు? సిబిఐ, ఐటి, ఈడీ కాకుండా ఇప్పుడు భారతదేశంలో ఎవరున్నారు?" తెలంగాణ మంత్రి అన్నారు.

“ప్రధాని మోదీ ఈరోజు పచ్చి అబద్ధాలు చెప్పి తన స్థాయిని దిగజార్చుకున్నారు. ప్రధానమంత్రి స్థాయి నాయకుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా అవమానకరం, ఖండించదగినది. కేసీఆర్ బీజేపీ లాంటి నాయకులతో, పార్టీలతో ఎప్పటికీ పనిచేయని పోరాటయోధుడు. మేం ఢిల్లీకి గులాములం కాదు. మేం గుజరాత్‌ గులాములం కాదు. మాది రెండుసార్లు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తెలంగాణ ప్రభుత్వం," అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు.

ప్రధాని మోదీ అనుకుంటారు.. తను చాలా పవిత్రమైన వ్యక్తి అని.. ప్రపచంలో మిగిలిన వాళ్లంతా అవినీతి పరులని అనుకుంటారు. ప్రధానికి ఒక్కటి గుర్తు చేయాలని అనుకుంటున్నా.. బీజేపీలో చేరిన కొందరు నేతలపై పెట్టిన కేసులు ఏమయ్యాయో చెప్పాలన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ ఈసారి 110 స్థానాల్లో డిపాజిట్ కోల్పోనుందని బీఆర్‌ఎస్ నేత ప్రకటించారు.

Next Story