బండి సంజయ్ ది నిరుద్యోగ దీక్ష కాదు సిగ్గులేని దీక్ష : మంత్రి కేటీఆర్
Minister KTR open letter to Bandi Sanjay.రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి
By తోట వంశీ కుమార్ Published on 26 Dec 2021 5:40 AM GMTరాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్టాలని కోరుతూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ రేపు ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ దీక్ష తలపెట్టారు. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు వెలువరించేదాకా తాము పోరాడుతూనే ఉంటామని చెప్పారు. కాగా.. ఈ నిరుద్యోగ దీక్షపై రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పనలో తమ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని చెబుతూ ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు.
బండి సంజయ్ తలపెట్టిన దీక్ష పచ్చి అవకాశవాదమేనని, బీజేపీ ప్రభుత్వం దేశ నిరుద్యోగ యువతకు ఏం చేసిందో సమాధానం చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ఏ గంగలో కలిపారో చెప్పాలన్నారు. ఇప్పటిదాకా ఎన్ని కోట్ల కొలువులు ఇచ్చారో దేశానికి లెక్క చెప్పే దమ్ముందా.. అని ప్రశ్నించారు. మీ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్ర యువతకు దక్కిన ఉద్యోగాలెన్నో చెప్పగలరా..? కొలువుల కల్పవల్లిగా వర్ధిల్లుతున్న హైదరాబాద్‌కున్న అద్భుత అవకాశమైన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది మీరు కాదా..? లక్షలాది యువత ఐటీ జాబ్స్ గండి కొట్టి.. యువతరం నోట్లో మట్టికొట్టి..మళ్లీ మీరే సిగ్గుఎగ్గూ లేకుండా నిరుద్యోగ దీక్షలకు దిగుతారా? మీ దీక్షలను, కపట ప్రేమను చూసి అవకాశావాదమే సిగ్గుతో పదేపదే ఆత్మహత్య చేసుకుంటుందని, యువతను నమ్మించి నట్టేట ముంచిన ద్రోహ చరిత్ర మీది, కేంద్రంలోని మీ ప్రభుత్వ పాలనా వైఫల్యాలతో దేశంలో నిరుద్యోగిత రేటు గత 40 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత స్థాయికి చేర్చిన ఘనత మీది అని ఎద్దేవా చేశారు.
డీమానిటైజేషన్, జీఎస్టీ నిర్ణయాలతో కొత్తగా వచ్చిన ఉద్యోగాలు ఎన్ని, ఊడిన ఉద్యోగాలు ఎన్నో చెప్పగలరా..? ప్రపంచమంతా కరోనా సంక్షోభ సమయంలో 20లక్షల కోట్ల ప్యాకేజీ అంటూ ఒక్క రూపాయి సాయం చేయని భారతీయ జుమ్లా పార్టీ మీది కాదా.. ? ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కానీ, మీరు అదికారంలో ఉన్న రాష్ర్టాల్లో మీరు కల్పించిన ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, ఖాళీలపైన ఒక శ్వేపపత్రం విడుదల చేసే దమ్ముందా.. బీజేపీ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా తెలంగాణ కంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చారా..? బూటకపు దీక్షకు పూనుకున్న మీరు రాష్ర్ట యువతను రెచ్చగొట్టి, వారిని చదువు నుంచి, ఉద్యోగ ప్రయత్నాల నుంచి దృష్టిని పక్కదారి పట్టించే కుట్రనే ఈ దొంగ దీక్ష.. చిత్తశుద్ధి ఉంటే దీక్ష చేయాల్సింది ఇక్కడ కాదు ఢిల్లీలోని జంతర్ మంతర్ లో!.. హామీ ఇచ్చిన దాని కన్నా ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగాలిచ్చిన మా ప్రభుత్వాన్ని కాదు, లక్షలాది ఉద్యోగాలను పెండింగ్ లో పెట్టిన మీ కేంద్ర ప్రభుత్వాన్ని గల్లా పట్టుకుని నిలదీయాలి.. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని 15లక్షల ఖాళీలను ఎందుకు ఇంకా భర్తీ చేయలేదో ప్రధానిని ప్రశ్నించాలి.హామీలపై కేంద్రాన్ని ప్రశ్నించలేని చేతకానితనంపై ఇందిరాపార్క్ సాక్షిగా ముక్కునేలకు రాసి ప్రజలకు వివరణ ఇవ్వాలి. రాజకీయ నిరుద్యోగంతో దీక్షకు దిగుతున్న మీరు అత్మవంచన చేసుకోకుండా ఆత్మపరిశీలన చేసుకోండి. నిరుద్యోగులకు, రాష్ట్ర యువతకు ఏ సాయమూ చేయలేని మీ చేతగానితనానికి, నిస్సహాయతకు క్షమాపణ కోరండి. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదు. అతి తక్కువ నిరుద్యోగం ఉన్న రాష్ర్టాల వరుసలో నిలిచింది తెలంగాణ రాష్ర్టం కాదా అంటూ కేటీఆర్ మండిపడ్డారు.
నిజం నిప్పులాంటిది. దాన్ని దాచాలని ముట్టుకుంటే చేతులు కాలిపోతాయి. మీకు ఈ సత్యం బాగా తెలిసినా, ఏమాత్రం గుణపాఠం నేర్చుకోకుండా ప్రజలను తప్పుదారి పట్టించడానికే భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ దొంగదీక్షకు పూనుకున్నారు. కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, అన్నిరంగాల్లో ప్రగతిపథంలో దూసుకెళ్తున్న తెలంగాణ యువతను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. మీ ప్రభుత్వ అస్తవ్యవస్థ విధానాలతో దేశంలో పేదరికాన్ని, నిరుద్యోగాన్ని చరిత్రలోనే రికార్డు స్థాయికి తీసుకెళ్లి, కనీవినీ ఎరుగని ఆర్థిక సంక్షోభంతోపాటు, మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ ప్రజలు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకోలేక సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నారు. మీది నిరుద్యోగ దీక్ష కాదు, పచ్చి అవకాశవాద, ఆత్మవంచన దీక్ష. ఉపాధి కల్పనకు నెలవుగా మారిన తెలంగాణలో మీకు చేయడానికి 'రాజకీయ ఉద్యోగం' లేక చేస్తున్నదే 'మీ నిరుద్యోగ దీక్ష.' అని కేటీఆర్ విమర్శించారు.
రాష్ట్రంలో ఏటా లక్షలాది యువతీయువకులు డిగ్రీలతో బయటికి వస్తున్నారు. డిగ్రీ పూర్తయిన అందరికీ ఉద్యోగాన్ని ప్రపంచంలో ఏ దేశమూ, ఏ ప్రభుత్వమూ కల్పించలేదు. అలాగని మేం మా బాధ్యత నుంచి కేంద్రంలోని మీ ప్రభుత్వం మాదిరి ఏనాడు తప్పించుకోలేదు. ఉపాధి కల్పనలో మా నిబద్ధతను చాటిచెప్పేలా సాధ్యమైనంత ఎక్కువమందికి ప్రభుత్వరంగంతోపాటు ప్రైవేట్ రంగంలోనూ లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించామని సగర్వంగా చెప్పగలనని మంత్రి కేటీఆర్ అన్నారు.