బ‌హ‌దూర్‌పురా ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

Minister KTR Inaugurated Bahadurpura Flyover.పాత‌బ‌స్తీ ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మంగ‌ళ‌వారం ఐటీ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  19 April 2022 7:54 AM GMT
బ‌హ‌దూర్‌పురా ఫ్లై ఓవ‌ర్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

పాత‌బ‌స్తీ ప‌రిధిలోని ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌కు మంగ‌ళ‌వారం ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. మొద‌ట బ‌హుదూర్‌పురా ఫ్లై ఓవ‌ర్‌ను మంత్రి ప్రారంభించారు. అనంత‌రం రూ. 495 కోట్ల విలువైన ఆరు ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేశారు. కాల‌ప‌త్త‌ర్ పోలీస్ స్టేష‌న్‌, ముర్గీ చౌక్‌, మీర్ ఆలం మార్కెట్ పున‌ర్ నిర్మాణం, చార్మినార్‌లోని స‌ర్దార్ మ‌హ‌ల్ రీస్టొరేష‌న్‌, కార్వాన్ నియోజ‌క‌వ‌ర్గంలో సీవ‌రేజ్ ప‌నుల‌కు మంత్రి శంకుస్థాప‌న చేశారు. హోంమంత్రి మ‌హ‌మూద్ అలీ, ఎంఐఎం అధ్య‌క్షుడు, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీతో క‌లిసి మంత్రి కేటీఆర్ ఈ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మొజంజాహి మార్కెట్‌ను అభివృద్ధి చేసిన ఘనత తమ ప్రభుత్వాదేన‌ని అన్నారు. ప్రపంచ వారసత్వ దినోత్సవం సంద్భంగా సర్దార్ మహల్‌ను అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రూ.109 కోట్లతో బహదూర్ పురా ఫ్లై ఓవర్‌ను నిర్మించామ‌ని తెలిపారు. కొన్ని మెట్రో నగరాల్లో మంచి నీటి కష్టాలు ఉన్నాయని, కానీ మన దగ్గర మంచినీటికి, కరెంట్‌కు ఇబ్బంది లేదన్నారు. పాతబస్తీ, ఇతర ప్రాంతాల్లో ఉన్న నోటరీ సమస్య త్వరలోనే పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు.

కులి కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామ‌ని చెప్పారు. మత విద్వేషాలను రెచ్చ గొట్టి కొందరు పబ్బం గడుపుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. విద్వేషాలను రెచ్చగొట్టే వారిని ఒక కంట కనిపెట్టల్సిన బాధ్యత అందరిదన్నారు. మత ఘర్షణల్లో చలి మంటలు కాచుకొంటున్న వారిని తరిమి కొడదామన్నారు. ఇక ఉస్మానియా జ‌న‌ర‌ల్ ఆస్ప‌త్రిని అభివృద్ధి చేస్తున్నామ‌ని చెప్పారు. పాల‌మూరు, న‌ల్ల‌గొండ, రంగారెడ్డి జిల్లా ప్ర‌జ‌ల‌కు ఈ ఆస్ప‌త్రి ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. హైద‌రాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ప్ర‌భుత్వ వైద్య స‌దుపాయాల‌ను పెంచుతున్నామ‌ని కేటీఆర్ తెలిపారు.

Next Story