'కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్‌'.. జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

నాగర్‌ కర్నూలులో జరిగిన నవ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌ తీవ్ర విమర్శలు

By అంజి  Published on  26 Jun 2023 8:53 AM GMT
Minister KTR, BJP, JP Nadda, Telangana

'కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్‌'.. జేపీ నడ్డాపై మంత్రి కేటీఆర్‌ ఫైర్‌

నాగర్‌ కర్నూలులో జరిగిన నవ సంకల్ప సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేశారు. తాజాగా జేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో స్కైవాక్‌ టవర్‌ని ప్రారంభించిన అనంతరం మంత్రి కేటీఆర్‌ మాట్లాడారు. నిన్న బీజేపీ సభలో నడ్డా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిపోయారని మండిపడ్డారు. నడ్డా.. ఎందుకో ప్రతిసారి కేసీఆర్‌ను జైలులో పెడతామంటున్నారు, అది ఎందుకో చెప్పాలన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ అందిస్తున్నందుకా? కేసీఆర్‌ కిట్లు, రెండు పడక గదుల ఇళ్లు ఇస్తున్నందుకా? తెలంగాణను అభివృద్ధి చేసినందుకా? కేసీఆర్‌ను ఎందుకు జైలుకు పంపుతావ్‌? అంటూ ప్రశ్నించారు. మాట్లడటానికి ఓ హద్దు, అదుపు ఉండాలని మంత్రి కేటీఆర్‌ ధ్వజమెత్తారు.

కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమన్నారు. ప్రశాంత వాతావరణ ఉంది కాబట్టే రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయన్నారు. ఐదేళ్లలో 35 ఫ్లైఓవర్లు నిర్మించామన్నారు. ఉప్పల, అంబర్‌పేట్‌ ఫ్లైఓవర్లు ఇంకా పూర్తి కాలేదని, నాలుగేళ్లుగా కేంద్రం పూర్తి చేయలేకపోతోందన్నారు. రూ.50 లక్షల నోట్ల కట్టలతో దొరికి చిప్పకూడు తిన్న వాళ్లు కూడా నీతులు చెబుతున్నారని మంత్రి కేటీఆర్‌ సెటైర్‌ వేశారు. భూమికి జానెడు, మూడు ఫీట్లు ఉన్న వారు కేసీఆర్‌పై విమర్శలు చేస్తే ప్రజలు ఊరుకోరన్నారు. కేసీఆర్‌తో పెట్టుకున్న వాళ్లు ఇంతవరకూ బాగుపడింది లేదని అన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లు ఏం చేయాలన్నా ఢిల్లీ పోవాలని, కానీ ఇక్కడ కేసీఆర్‌ స్వీయ నేతృత్వంలో తెలంగాణ దూసుకుపోతోందన్నారు. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయ్యాకా.. అన్ని రంగాల్లో తెలంగాణ దూసుకుపోతోందని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఉప్పల్‌ స్కైవాక్‌:

ఉప్పల్‌ స్కైవాక్‌ని ప్రజల ఇబ్బందులను ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని రూ.36.50 కోట్ల వ్యయంతో హెచ్‌ఎండీఏ నిర్మించింది. ఎక్కడా రోడ్డు దాటే అవసరం లేకుండా.. అటు నుంచి ఇటు వైపు.. ఇటు నుంచి అటు వెళ్లేందుకు వీలుగా దీనిని నిర్మించారు. 665 మీటర్ల పొడవు, 4 మీటర్ల వర్టికల్‌ వెడల్పు, ఆరు మీటర్ల ఎత్తులో బస్టాపులు, మెట్రోస్టేషన్‌ను కలుపుతూ.. ఈ స్కైవాక్‌ ఉంది. 8 చోట్ల లిఫ్ట్‌లు,4 ఎస్కలేటర్స్‌, 6 చోట్ల మెట్ల సౌకర్యాన్ని కల్పించారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు స‌మీపంలోని వ‌రంగ‌ల్ బ‌స్టాప్, ఉప్పల్ పోలీస్ స్టేష‌న్, ఉప్పల్ ఎల‌క్ట్రిక‌ల్ స‌బ్‌స్టేష‌న్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు.

Next Story