కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా మరోసారి మండిపడ్డారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను ఆయన తప్పుబట్టారు. ఎన్డీయే అసమర్థ పాలన వలనే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం తారాస్థాయికి చేరిందన్నారు. 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగ రేటు చేరుకుందని, అలాగే.. 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు.
కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన డేటాను విశ్లేషిస్తూ ఓ ఆంగ్ల పత్రిక రాసిన కథనాన్ని మంత్రి కేటీఆర్ తన ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. ఇంధన ధరలు కూడా దేశంలో ఆల్ టైమ్ హైకి చేరాయని, ప్రస్తుతం ప్రపంచంలో ఎక్కడా లేనంతగా ఎల్పీజీ ధరలు ఉన్నాయన్నారు. వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని భారతీయ రిజర్వు బ్యాంకు చెబుతోందని, ఇలాంటి పరిస్థితులకు కారణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని పిలవాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ఎన్‌పీఏ అంటే (నాన్ పర్ఫార్మింగ్ అసెట్-నిరర్థక ఆస్తి) అని భక్తులకు (బీజేపీ అభిమానులకు) వివరించి చెబుతున్నానంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రతిభ చూపించని ప్రభుత్వంగా ఎన్డీయే చరిత్రలో నిలిచిపోతుందని మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో తెలిపారు.