కేటీఆర్ మాటలకు అర్థం.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బెటర్ అయ్యిందనేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే.

By Medi Samrat  Published on  9 Oct 2023 12:49 PM GMT
కేటీఆర్ మాటలకు అర్థం.. సీఎం కేసీఆర్ ఆరోగ్యం బెటర్ అయ్యిందనేనా?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై గత కొద్దిరోజులుగా చర్చ జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. ఆయనకు ఇన్ఫెక్షన్ సోకిందని ఇటీవలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. తాజాగా ఓ సభలో ఆయన మాట్లాతూ పులి బయటకు వస్తుందని వ్యాఖ్యలు చేశారు. రేపో మాపో పులి బయటకు వస్తుందని.. అది బయటకు వచ్చాక ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లీ తొర్రలకే పోతాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పరకాలలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హ‌యాంలో రూ.200 పెన్ష‌న్ ఇస్తే కేసీఆర్ దానిని పదిరెట్లు పెంచారన్నారు. కాంగ్రెస్ హ‌యాంలో 29 ల‌క్ష‌ల మందికి పెన్ష‌న్లు వచ్చేవని, ఇప్పుడు 46 ల‌క్ష‌ల మందికి వస్తున్నాయన్నారు. రేవంత్ రెడ్డి, కిష‌న్ రెడ్డి, ఇవాళ ఎగిరెగిరి ప‌డుతున్న, నీలుగుతున్న న‌క్క‌లు, మూలుగుతున్న తోడేళ్లు అన్ని మ‌ళ్లా తొర్ర‌ల‌కే పోతాయన్నారు.

ఎన్నిక‌ల సమయంలో ఏమేం చేయాల‌ని కేసీఆర్ అన్ని లెక్క‌లు తీస్తున్నారన్నారు కేటీఆర్. మ‌నం ఏం మాట్లాడినా బాధ్య‌త‌తో మాట్లాడుతామని, కానీ కాంగ్రెస్ వాళ్లకు బాధ్యత లేదన్నారు. నెత్తి వాళ్లది కాదు, క‌త్తీ వాళ్లది కాదు ఎటువ‌డితే అటు గీకుతాడని చురకలు అంటించారు. కాంగ్రెస్ గెలిచేది లేదు, పీకేది లేదన్నారు. కాంగ్రెస్ 60 ఏళ్లు మనల్ని వేధించిందన్నారు. వచ్చే ఎన్నికలు ఏకపక్షమేనని, బీఆర్ఎస్‌కు భారీ విజయం ఖాయమన్నారు. మంచి చేసే బీఆర్ఎస్‌కు ప్రజలు హ్యాట్రిక్ విజయం అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. "రేపో మాపో పులి బయటకు వస్తుందని, అది బయటకు వచ్చాక ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్న నక్కలన్నీ మళ్లీ తొర్రలకే పోతాయి" అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సభలో ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ఈ వ్యాఖ్యలను బట్టి సీఎం కేసీఆర్ కోలుకున్నారని స్పష్టంగా తెలుస్తోందని అన్నారు.

Next Story