డీప్‌ ఫేక్‌ రాజకీయ నాయకులకూ ప్రమాదకరమే: మంత్రి కేటీఆర్

ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించి డీప్‌ ఫేక్‌ వీడియోలు చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.

By Srikanth Gundamalla  Published on  19 Nov 2023 7:32 PM IST
minister ktr, brs, telangana, elections,

 డీప్‌ ఫేక్‌ రాజకీయ నాయకులకూ ప్రమాదకరమే: మంత్రి కేటీఆర్

హైదరాబాద్‌లోని గ్రాండ్‌ కాకతీయలో వుమెన్‌ ఆస్క్‌ కేటీఆర్‌ పేరుతో మహిళలతో మంత్రి కేటీఆర్‌ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్‌ తన చిన్నప్పటి నుంచి కేసీఆర్‌ ప్రజా జీవితంలో ఉన్నారనీ.. అందుకే తనపై ఆయన ప్రభావం తక్కువగా ఉండేదని చెప్పుకొచ్చారు. తన తల్లిని చూసి చాలా నేర్చుకున్నానని చెప్పారు మంత్రి కేటీఆర్. అలాగే తన చెల్లి కవి చాలా డైనమిన్‌ అని.. కుటుంబంలోనే అత్యంత ధైర్యవంతురాలని మంత్రి కేటీఆర్ అన్నారు.

మంత్రి కేటీఆర్ తన సతీమని చాలా ఓపికగా ఉంటుందని చెప్పుకొచ్చారు. కూతురు చిన్న వయసులోనే బాగా ఆలోచిస్తోందని.. కూతురు పుట్టాక తన జీవితం మారిపోయిందన్నారు మంత్రి కేటీఆర్. తాను ఒకరిని ఎక్కువగా మరొకర్ని తక్కువ చేయనని.. ఇద్దరు పిల్లలని సమానంగా చూస్తానన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలిస్తే మహిళలకు తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తామని మంత్రికేటీఆర్ చెప్పారు. ఎన్నికల్లో మహిళలకు సరైన సంఖ్యలో టికెట్లు ఇవ్వలేదని.. ఈ విషయంలో బాధగా ఉందన్నారు. మహిళలు ఎప్పుడూ మానసికంగా బలంగా ఉంటారని.. వారిని చూసి మగవారు చాలా నేర్చుకోవాలని కేటీఆర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇక ప్రస్తుతం ఏఐ టెక్నాలజీని ఉపయోగించి డీప్‌ ఫేక్‌ వీడియోలు చేస్తున్నారు కొందరు ఆకతాయిలు. వాటిపై కూడా కేటీఆర్ స్పంందించారు. డీప్‌ ఫేక్‌ వీడియోలు సమాజానికి మంచిది కాదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల మహిళలకు మాత్రమే కాదు.. రాజకీయ నాయకులకూ ప్రమాదకరమే అని చెప్పారు. ప్రత్యర్థులు డీప్‌ ఫేక్‌ వాడి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తాను రష్మిక మందన్నా అంత ఫేమస్‌ కాదని సరదాగా వ్యాఖ్యానించారు. కాగా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ గెలుపు ఖాయమని.. ఈ విషయం ప్రతిపక్షాలకు కూడా తెలుసని అన్నారు.

Next Story