కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. దీంతో దాదాపు ఆస్పత్రులన్ని కరోనా పేషంట్లతో నిండిపోతున్నాయి. ప్రస్తుత సమయంలో సాయం చేసే చేతుల కోసం ఎదురు చూసే చూపులు ఎన్నో. ఏపీలోని విజయవాడలో ఓ యువతి కరోనా బారిన పడి ఆస్పత్రిలో చేరింది. ఆ యువతి పరిస్థితిని వివరిస్తూ ఆమె సోదరుడు సాయం చేయాల్సిందిగా తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కోరారు.
'మా సిస్టర్ విజయవాడలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెకు రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు అవసరం. నిజంగా మీరు దేవుడు. దయచేసి మా ఆంధ్ర ప్రజలకు సహాయం చేయరా' అంటూ గుప్తా అనే వ్యక్తి మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్ తప్పకుండా అంటూ.. తన స్నేహితుడు, ఏపీ పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ మీకు సహాయం చేయనున్నట్లు తెలిపారు. ఆ మేరకు గౌతంరెడ్డితో మాట్లాడారు. ఈ మేరకు ఏపీ మంత్రి కార్యాలయ సిబ్బంది స్పందించి.. రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్లు ఏర్పాటు చేశారు. ఇలా అత్యవసర సమయంలో సాయం చేసినందుకు మంత్రులు కేటీఆర్, మేకపాటి గౌతంకు గుప్తా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపాడు.