కేంద్రప్రభుత్వం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో 2022-23 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ జీ.. ఎన్డీఏ గవర్నమెంట్ బడ్జెట్ 2022ను ప్రవేశపెట్టేందుకు సిద్దమైన నేపథ్యంలో మీరిచ్చిన హామీలను ఒకసారి గుర్తు చేయాలనుకుంటున్నాను. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ ఇచ్చిన హామీని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
2022 నాటికి ప్రతి భారతీయుడికి ఇల్లు నిర్మించి ఇస్తామని, ప్రతి ఇంటికి నీరు, విద్యుత్, టాయిలెట్ సదుపాయం కల్పిస్తామన్న హామీలను కేటీఆర్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఈ బడ్జెట్‌లో అన్ని రాష్ట్రాలకు కేటాయింపులు సమానంగా ఉంటాయని, వాస్తవికతను ప్రతిబింబించేలా ఈ బడ్జెట్ ఉంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. నీతి ఆయోగ్ చెప్పినట్లు మిషన్ కాకతీయకు, భగీరథకు నిధులు ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలన్ని నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ లాంటి అభివృద్ది చెందుతున్న రాష్ట్రాలకు మద్దతు ఇవ్వాలని కోరారు.