బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధును అమలు చేయించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కి సవాల్ విసిరారు. మంత్రి కొప్పుల మాట్లాడుతూ.. దళితబంధును వెంటనే అమలు చేయమని బండి సంజయ్ అనడం హాస్యాస్పదమని అన్నారు. ఈటల రాజేందర్, బండి సంజయ్‌లు గత మూడు రోజులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కొప్పుల అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచనతో తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న గొప్ప పథకం దళితబంధు అని అన్నారు. బీజేపీ ఫిర్యాదు వల్లే హుజురాబాద్ బైపోల్‌లో దళితబంధు పథకం నిలిచిపోయిందన్నారు. దళితబంధు గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదన్నారు. దళితులపైన బండి సంజయ్‌కి ప్రేమ ఉంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు తీసుకురావాలని మంత్రి కొప్పుల డిమాండ్ చేశారు.
బీజేపీ దళితులను మోసం చేస్తోందని మండిపడ్డారు. హుజురాబాద్ బై పోల్‌లో ఎక్కడా లేని మేనిఫెస్టో విడుదల చేశారని, మేనిఫెస్టోలోని హామీలను అమలు చేయాల్సిన బాధ్యత బండి సంజయ్‌దే అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం సంపదను పెంచి పేద ప్రజలకు పంచుతుంటే.. బీజేపీ ప్రభుత్వం మాత్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోందని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని లొట్టపీసు చట్టం అని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అనడం.. ఆ పార్టీకి దళితులపై ఉన్న చిత్తశుద్ధిని తెలుపుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీలు బహిరంగంగా సహకరించుకోవడం వల్లే హజురాబాద్ బైపోల్‌లో టీఆర్‌ఎస్ ఓడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీతో అనైతిక పొత్తు పెట్టుకున్న ఈటల రాజేందర్ విర్రవీగుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా అబద్దాలు చెప్పడం మానుకోవాలని హితవు పలికారు.