సీఎం రేవంత్‌పై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు
తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
By - Knakam Karthik |
సీఎం రేవంత్‌పై మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మిత సంచలన ఆరోపణలు
తెలంగాణలో పాలిటిక్స్ ఓ రేంజ్‌లో హీటెక్కాయి. ఓ వైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరో వైపు అధికార కాంగ్రెస్‌లోని మంత్రుల మధ్య విబేధాలు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు కలిసి తమ కుటుంబం మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి మా అమ్మ సురేఖను మంత్రి పదవి నుంచి తీసేయాలని చూస్తున్నాడు. సుమంత్ మీద కేసు పెట్టి దానిని మెల్లగా మా అమ్మ మీదకు డైవర్ట్ చేసి మంత్రి పదవి నుంచి తీసేయాలని చూస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డిలు కలిసి బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు..అని ఆరోపించారు.
డబ్బుల కోసం డెక్కన్ సిమెంట్స్ కంపెనీ యాజమాన్యాన్ని పాయింట్ బ్లాంక్‌లో గన్ పెట్టి బెదిరించాడని మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్‌పై ఆరోపణలు వచ్చాయి, దీంతో సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్ రెడ్డి కార్యాలయంలో డబ్బుల కోసం గన్ పెట్టి బెదిరించిన ఆరోపణలపై సుమంత్‌పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలోనే సుమంత్‌ను అరెస్ట్ చేసేందుకు బుధవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆమె ఇంటికి వెళ్లారు. అయితే వారితో కొండా సుస్మిత వాగ్వాదానికి దిగారు. ఓఎస్డీ సుమన్‌ను ఇంట్లోనే దాచిపెట్టారని టాస్క్‌ఫోర్స్ పోలీసులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె అడ్డుకున్నారు.
అయితే సుమంత్ దగ్గర గన్ దొరికింది అనే కేసులో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు లెటర్ తనకు చూపించాలని సుస్మిత డిమాండ్ చేశారు. నిజంగానే సుమంత్ దగ్గర గన్ ఉంటే..అప్పుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడు రోహిన్‌రెడ్డిపై కూడా కేసు పెట్టాలని అన్నారు. సుమంత్‌కు ఏమైనా హాని జరిగితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది..అని సుస్మిత హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన గన్‌ను రోహిన్‌రెడ్డి తెచ్చాడు. అదే గన్‌తో డెక్కన్ సిమెంట్స్ వాళ్లను డబ్బుల కోసం బెదిరించారు. ఈ విషయంలో మా నాన్నను ఇరికించే ప్రయత్నాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి..అని కొండా సుస్మిత పేర్కొన్నారు.