ఈవోల‌పై దాడి చేస్తే ఊరుకోం.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక చొర‌వ తీసుకోవాలి : మంత్రి కొండా సురేఖ

దేవుడి భూములు ర‌క్షించే ఈవోల‌పై దాడి చేస్తే ఊరుకోమ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చ‌రించారు

By Medi Samrat
Published on : 8 July 2025 7:42 PM IST

ఈవోల‌పై దాడి  చేస్తే ఊరుకోం.. సీఎం చంద్ర‌బాబు ప్ర‌త్యేక చొర‌వ తీసుకోవాలి : మంత్రి కొండా సురేఖ

దేవుడి భూములు ర‌క్షించే ఈవోల‌పై దాడి చేస్తే ఊరుకోమ‌ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హెచ్చ‌రించారు. భ‌ద్రాచ‌లం ఈవో ర‌మాదేవిపై దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ఎక్క‌డైనా... రూల్స్ విరుద్ధంగా ఎండోమెంట్ భూముల‌ను క‌బ్జా చేస్తే పీడీ యాక్టు పెడుతాం.. ఈ విష‌యంలో గ‌తంలోనూ తాము స్ప‌ష్టం చేశామ‌ని గుర్తుచేశారు.

భద్రాచలం రామాలయ భూములు పురుషోత్తపట్నం (ఏపీ)లో కబ్జాకి గురవుతుండగా అడ్డుకున్న ఈవో రమాదేవిపై దాడి చేయ‌డం స‌హేతుకం కాద‌న్నారు. ఈ విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం.. ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌త్యేక చొర‌వ తీసుకొని.. స‌మ‌స్య‌ను ప‌రిష్కారం చేయాల‌ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అభ్య‌ర్థించారు.

బ్యాక్‌గ్రౌండ్ విష‌యం ఏంటీ?

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి పురుషోత్తపట్నంలో భూములున్నాయి. ఆ భూమిలో అనుమతి లేకుండా భవన నిర్మాణ పనులు చేపడుతుండటంతో భ‌ద్రాచ‌లం టెంపుల్‌ సిబ్బంది దాన్ని అడ్డుకునే క్రమంలో.. ఆ గ్రామస్థులతో త‌ర‌చూ ఘర్షణ జరుగుతుంది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భద్రాద్రి రాముడికి సుమారు 1,300 ఎకరాల భూమి ఉండగా అందులో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తపట్నంలోనే గరిష్ఠంగా 889.5 ఎకరాలు ఉంది. పురుషోత్తపట్నంలోని భూమి ఎక్కువ భాగం ఆక్రమణకు గురైంది. కోర్టు తీర్పు ప్రకారం.. ఈ భూమిపై దేవస్థానానికి హక్కులు లభించాయి. వీటిని పురుషోత్తపట్నం వాసులు పరిగణనలోకి తీసుకోవటం లేదు. పురుషోత్తపట్నంలోకి ప్రవేశించే మార్గంలో పిల్లర్లతో నిర్మాణ పనులు చేపడుతున్నారనే సమాచారం అందుకున్న ఆలయ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. అనుమతి లేకుండా ఇళ్ల నిర్మాణం చేయవద్దని, ఇది పూర్తిగా రాముడి భూమి అని వివరించారు. కోర్టు తీర్పులతో దేవుడి పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్నాయని వెల్లడించారు. అయితే, ఈవో అభ్యంత‌రాలు విన‌కుండా... స్థానికులు ఈవోపై దాడి చేశారు. దీంతో ఆమె సృహా కోల్పోయిన ప‌రిస్థితి నెల‌కొంది.

Next Story