రైతులకు గుడ్‌న్యూస్ చెప్పిన మంత్రి కోమటిరెడ్డి
త్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
By Kalasani Durgapraveen Published on 28 Nov 2024 7:15 PM ISTత్వరలో రైతులందరికీ రైతు భరోసా డబ్బులను వారి ఖాతాలో జమ చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి సందర్భంగా గురువారం నల్లగొండలోని క్లాక్ టవర్ సెంటర్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా త్వరలో రైతు సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. డిసెంబర్ 7న బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు, నల్గొండలోని మెడికల్ కళాశాలకు సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అనంతరం ఎన్జీ కళాశాలలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని వెల్లడించారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు రిజర్వాయర్ ను ఇప్పటికే నింపడం జరిగిందని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో చుట్టుపక్కల గ్రామాలలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగు ఆయకట్టు పెరుగుతుందన్నారు. బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టుతో 18 సంవత్సరాల తన చిరకాల వాంఛ నెరబొరబోతుందని అన్నారు. రైతు రుణమాఫీని పూర్తిస్థాయిలో రైతులకు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
నల్గొండ పట్టణంలో రూ.110 కోట్లతో స్పెషల్ డెవలప్మెంట్ కింద అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తోపాటు పలు అభివృద్ధి పనులు, రూ.40 కోట్లతో నర్సింగ్ కళాశాలకు శంకుస్థాపన, రూ.275 కోట్లతో నిర్మించిన మెడికల్ కళాశాల భవనాన్ని సీఎం చేతుల మీదుగా శంకుస్థాపన చేయడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. అదేవిధంగా పాత టౌన్ హాల్లో కొత్తగా జిల్లా గ్రంథాలయంకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. వీటితో పాటు రూ.100 కోట్లతో లతీఫ్ షాప్ దర్గా, బ్రహ్మంగారి గుట్ట ఘాట్ రోడ్డులకు శంకుస్థాపన చేయడానికి ఇప్పటికే ఆర్ అండ్ బి శాఖ అధికారులతో సమావేశం నిర్వహించి ఎస్టిమేట్ వేయడం జరిగిందని వెల్లడించారు. వీలైతే వీటిని సీఎంతో శంకుస్థాపన చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డితో పాటు, ఎంపీ,ఎమ్మెల్యేలు పాల్గొంటారని పేర్కొన్నారు. శుక్రవారం సీఎం పర్యటనకు సంబంధించి ఖచ్చితమైన తేదీని చెబుతానని పేర్కొన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటిని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. మూసీతో ఎక్కువ నష్టపోయేది, అనారోగ్యం పాలయ్యేది నల్లగొండ జిల్లా ప్రజలేనని అన్నారు. మూసీ ప్రక్షాళనతో న్యాయం జరుగుతుందన్నారు.