ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ 'దిష్టి' వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వాకిటి శ్రీహరిలు ఫైర్ అయ్యారు. పవన్ కల్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకునేది లేదన్నారు. పవన్ కల్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. లేదంటే రాష్ట్రంలో ఆయన సినిమా ఒక్కటి కూడా ఆడదని సినిమాటోగ్రఫీ మంత్రిగా చెబుతున్నానన్నారు. సారీ చెబితే ఒకటో.. రెండో రోజులు ఆడతాయని స్పష్టం చేశారు.
ఆంధ్రపాలకుల వల్ల తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. మంత్రిగా అనుభవం లేకనే ఇటువంటి వ్యాఖ్యలు పవన్ కల్యాణ్ చేస్తున్నారన్నారు. రెండు ప్రాంతాల మధ్య విద్వేషం పెంచే మాటలు సరికాదని శ్రీహరి అన్నారు. ఇటీవల కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ వాళ్ల దిష్టితగలడమేనని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి ఈ రకంగా స్పందించారు.
కోనసీమకు దిష్టి తగిలిందని, రాష్ట్రం విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనమూ కారణమై ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇటీవల అభిప్రాయపడ్డారు. నరుడి దిష్టికి నల్ల రాయి అయినా బద్దలై పోతుంది అంటారు.. కోనసీమ కొబ్బరి చెట్లకు కూడా అదే జరిగి ఉంటుంది అని వ్యాఖ్యానించారు. కోనసీమ పర్యటనలో భాగంగా శంకరగుప్తం డ్రెయిన్ పొంగి నష్టపోయిన కొబ్బరి తోటలను పవన్ కల్యాణ్ ఇటీవల పరిశీలించారు.