హరీష్ రావుకు మంత్రి జూపల్లి సవాల్
రైతులకు కరెంట్ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు.. పది ఏండ్లు మీరు ఏమి చేశారని పర్యాటక శాఖామంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
By Medi Samrat Published on 26 March 2024 3:45 PM ISTరైతులకు కరెంట్ ఇవ్వకపోతే సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు అంటున్నారు.. పది ఏండ్లు మీరు ఏమి చేశారని పర్యాటక శాఖామంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు. గాంధీ భవన్‌లో పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఈర్ల పల్లి శంకర్ లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నదిలో నీళ్లు ఉన్నా కూడా నీళ్లు ఇవ్వలేదని.. కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వహణ చేస్తే ఇప్పుడు సాగునీటి కష్టాలు వొచ్చేటివి కావన్నారు. మీరు ఎప్పుడు ఎవరి ఫోన్ ట్యాప్ చెయ్యాలని చుసిండ్రు.. తప్పా ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు.
పంట నష్టం జరిగిన రైతులకు అందరికీ వంద శాతం అకౌంట్లలో డబ్బు జమ చేస్తామన్నారు. గడిచిన పది ఏండ్లు రైతులకు పంట నష్టం బీఆర్ఎస్ ప్రభుత్వం చెల్లించలేదని.. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ది కోసం హరీష్ మాట్లాడారని.. హరీష్ రావు కు మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల బాగోగులు కోరుకునే ప్రభుత్వమన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 6 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టులపై 1లక్ష 81 వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో చెప్పాలన్నారు. పాలమూరు-రంగా రెడ్డి ప్రాజెక్టు కు ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ అప్రూవల్ రాలేదన్నారు.
హరీష్ రావు కు ఛాలెంజ్ విసురుతున్నా.. ఎక్కడ కి రమ్మంటే అక్కడికి వస్తా చర్చకు సిద్ధమా.. హరీష్ రావ్ లంగా మాటలు మాట్లాడొద్దని ధ్వజమెత్తారు. ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది మీరూ కాదా అని ఫైర్ అయ్యారు. మీ ప్రభుత్వ హాయంలో దోపిడీ జరగకుంటే.. అన్ని వర్గాలకు న్యాయం జరిగేదన్నారు. ఎనిమిది లక్షల కోట్ల అప్పుల చిప్పలు మాకు అప్పజెప్పారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం ఐదు గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ నాయకుల బండారం ఒక్కొక్కటి బయట పడుతోందన్నారు. రైతాంగం, అవినీతి పైన నేను ఎక్కడైనా ఓపెన్ డిబేట్ కు సిద్ధమన్నారు.