సీపీఐ నేతలను కలిసిన మంత్రి జగదీశ్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు
Minister Jagadeesh Reddy Fire On CPI Leaders. టిఆర్ఎస్ ఐక్యతను ఇక ముందు కూడా కొనసాగించాలని, దేశంలో మతతత్వ,
By Medi Samrat Published on 8 Nov 2022 9:00 PM IST
టిఆర్ఎస్ ఐక్యతను ఇక ముందు కూడా కొనసాగించాలని, దేశంలో మతతత్వ, అభివృద్ధి నిరోదక శక్తులను నిలువరించేందుకు ప్రగతిశీల శక్తులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి అన్నారు. ఇదే పద్ధతిలోనే ప్రయాణం చేస్తామని చెప్పారు. సిపిఐ, సిపిఐ(ఎం) మద్దతుతో మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధించిన నేపథ్యంలో మంత్రి జగదీశ్ రెడ్డి, మునుగోడు ఎంఎల్ ఎ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తుంగతూర్తి ఎంఎల్ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్, ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ హైదరాబాద్ మగ్ధుంభవన్ సిపిఐ నేతలను మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు,జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి, ఈ.టి. నర్సింహా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, మంత్రికి సిపిఐ నేతలు మిఠాయిలు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా అంతకుముందు ప్రభుత్వ విప్ బాల్క సుమన్, టిఆర్ ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మగ్ధుంభవన్ సిపిఐ నేతలను మార్యదపూర్వకంగా కలిసి కృతజ్ఞత తెలియజేశారు.
రాష్ట్రంలో అలజడి సృష్టించే యత్నం: మంత్రి జగదీశ్ రెడ్డి
రాష్ట్రంలో సజావుగా సాగుతున్న పరిపాలనకు ఆటంకాలను సృష్టించి, అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్ర బిజెపి రెండూ కలిసి కుట్రతో ఉప ఎన్నికను సృష్టించి, రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించే యత్నం చేశాయని విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్ రెడ్డి విమర్శించారు. బిజెపిని అడ్డుకునే పార్టీ టిఆర్ఎస్ అని విశ్వసించి సిపిఐ తమకు మద్దతునిచ్చిందన్నారు. కమ్యూనిస్టుల మద్దతుతోనే టిఆర్ఎస్ గెలిచిందని అన్నారు.
బిజెపికి ముగింపు కార్డ్ వేశాం: కూనంనేని
మునుగోడు ఎన్నిక ద్వారా బిజెపికి ముగింపు కార్డ్ వేశామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో బిజెపి వాసనే లేదని, రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తి ఒకరిద్దరు దొరికితే వారే ఆధారంగా ఉండేదని, కానీ ఆ వికెట్లు పడిపోయాయని ఎద్దేవా చేశారు. కమ్యూనిస్టు నాయకులు విజ్ఞప్తి చేసిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తామని సిఎం కెసిఆర్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఆర్‌టిసి సమస్యల పరిష్కారాన్ని మంత్రులు ఒక దశకు తీసుకొచ్చారని, మరో ఒకటి, రెండు సమస్యలు ఉన్నాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.