నిర్మల్ జిల్లా కేంద్రం మంచిర్యాల చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. పేపర్స్ లీకేజీల వ్యవహారంలో బీజేపీ అసలు రంగు బయట పడిందని అన్నారు. పదవ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ నిందితుడితో బండి సంజయ్ సహా బీజేపీ నేతలకు ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్ లో ఇదంతా జరుగుతున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని అన్నారు. తెలంగాణపై కేంద్రం కక్ష్య గట్టిందని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అలజడి సృష్టించాలని చూస్తోందని అన్నారు. పథకం ప్రకారమే ప్రశ్నపత్రాలను లీక్ చేస్తున్నారని.. దోషులు ఎంతటి వారైనా వదిలిపెట్టం అని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వాన్ని కేంద్రం బదనాం చేయాలని చూస్తోందని అన్నారు. గతంలో ఎన్నడూ కూడా తెలంగాణలో ఈ విధంగా పేపర్ లీకేజీలు ఘటనలు జరగలేదు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో తెలంగాణలో ఏదో ఒక అలజడి సృష్టించి, రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి చూస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండించారు. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్, నిన్న పదవ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో బీజేపీ నేతలు, ఆ పార్టీ సానుభూతిపరుల కుట్ర కోణంపై నిష్పక్షపాత దర్యాఫ్తు కొనసాగుతోందని అన్నారు. దోషులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని అన్నారు. బీజేపీ నేతల తీరును నిరసిస్తూ.. దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.