తెలంగాణ మంత్రి హరీశ్ రావు పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కంటే ముందే పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించారని, ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తికాలేదని అన్నారు. మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేట్టు కనిపించడంలేదని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడానని.. మరో ఐదేళ్లలో ప్రాజెక్టు పూర్తయితే గొప్పేనని ఇంజినీర్లు చెప్పారని వెల్లడించారు. పోలవరంపై అక్కడి ఇంజినీర్లకే స్పష్టత లేదని అన్నారు. కానీ తెలంగాణలో కాళేశ్వరంపై విపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.
ఇక తెలంగాణలో త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ యువత కు అగ్నిపత్ పేరుతో ఆర్మీ ఉద్యోగాలు రాకుండా చేసిందని.. యువత జీవితాన్ని నాశనం చేసే విధంగా ఆర్మీలో అగ్నిపత్ పేరుతో కాంటాక్ట్ విధానం తెచ్చిందని మండిపడ్డారు. త్వరలో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇస్తామని.. 95% స్థానికులకే అవకాశం కల్పిస్తామని ప్రకటించారు.