రిజర్వేషన్లను తొలగించడానికే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ చర్యలపై మండిపడ్డారు. టి.ఆర్.ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కారణంగా ప్రజలు.. పట్టణాలు, నగరాల నుంచి స్వగ్రామాలకు తిరిగి వెళ్తున్నారని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో అన్ని రంగాల్లో తెలంగాణ రోల్మోడల్గా నిలిచిందని హరీశ్ రావు అన్నారు.
బిజేపి నేతలు.. రాష్ట్రప్రభుత్వం వల్లే ఐటీఐఆర్ రాలేదని చెబుతున్నారని.. ఈ ప్రాజెక్ట్ పై కేంద్రానికి.. కేసీఆర్, కేటీఆర్ లేఖలు రాసినట్లు గుర్తుచేశారు. ఏడేళ్లలో బిజేపి ప్రభుత్వం, ఆ పార్టీ ఎమ్మెల్సీ రాంచందర్రావు ఏం చేశారో చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఆరేళ్లలో 12 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు.. ఎన్ని ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. బీఎస్ఎన్ఎల్లో 50 శాతం మందిని తొలగించారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. బీహెచ్ఈఎల్, బీడీఎల్‌నూ ప్రైవేటుపరం చేస్తారన్నారు.
అభివృద్ధి కొనసాగాలంటే హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం టి.ఆర్.ఎస్ అభ్యర్థి వాణీదేవిని గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజేందర్ గౌడ్, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు.