నాడు త‌న్నుల ప‌రిస్థితి.. నేడు టన్నుల సంస్కృతి.. కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ సెటైర్లు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమ‌ని మంత్రి హరీశ్ రావు అన్నారు.

By Medi Samrat  Published on  14 Sep 2023 9:30 AM GMT
నాడు త‌న్నుల ప‌రిస్థితి.. నేడు టన్నుల సంస్కృతి.. కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్ సెటైర్లు

ఆర్టీసీని ప్రభుత్వంలో విలినాన్ని ఆమోదిస్తూ నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమ‌ని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఖమ్మం ప్రెస్ మీట్ లో ఆయ‌న మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు శుభాకాంక్షలు తెలియ‌జేశారు. సీఎం పాలమూరు ప్రాజెక్ట్ ప్రారంభం చేస్తాం అంటే ప్రతి పక్షాలు శకుని పాత్ర పోషిస్తున్నాయని మండిప‌డ్డాయి. ప్రజలు పండగ లా భావిస్తే, వారు దండగ అంటున్నారు. పాలమూరు ప్రజల కరువు తీర్చే అతి పెద్ద ప్రాజెక్టు. కాళేశ్వరం కంటే పెద్దది అని అన్నారు. ప్రాజెక్ట్ దండగ కాదు, ప్రతి పక్షాలు దండగ అని ఎద్దేవా చేశారు. నాడు అడ్డంకులు సృష్టించారు. ఇప్పుడు మళ్లీ అడ్డగోలుగా మాట్లాడుతూ.. పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కేసీఆర్ ను ఇంటి మనిషి అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. మనకు పనోల్లు కావాలా, పగోల్లు కావాలా ప్రజలు ఆలోచించాలని అన్నారు. ప్ర‌జ‌లు బిఆర్ఎస్ కావాలి, కాంగ్రెస్ వద్దు అని అంటున్నారు. రాబోయే ఎన్నికల్లో నోబెల్స్, గోబెల్స్ కి పోటీ అని పేర్కొన్నారు. గోబెల్స్ ప్రచారం చేసే కాంగ్రెస్ ను ప్రజలు కోరుకోరు అని అన్నారు. బీఆర్ఎస్ మరోసారి గెలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కౌరవుల లాగా వంద అబద్ధాలు ఆడినా మీ పక్క జన బలం లేదని అన్నారు.

50 ఏళ్లలో కాంగ్రెస్ ఎందుకు ప్రాజెక్టులు కట్టలేదు. ఎందుకు నీళ్ళు ఇవ్వలేదు, కరెంట్ ఇవ్వలేదు. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయలేదని ప్ర‌శ్నించారు. ఆకలి అయితే నాడు అన్నం పెట్టలేదు. కానీ నేడు గోరుముద్దలు తినిపిస్తం అంటున్నారు అని ఎద్దేవా చేశారు. ఛత్తీస్ గడ్, కర్ణాటక, రాజస్థాన్ లో చేయరు.. కానీ ఇక్కడ ఎలా చేస్తారని ప్ర‌శ్నించారు.

ఎరువుల కోసం ప్రజలు తన్నులు తినేవారు. తన్నుల పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పాల‌న‌లో అయితే బిఆర్ఎస్ హయాంలో టన్నుల (పంట ఉత్పత్తి) సంస్కృతి అని సెటైర్లు సంధించారు. సీట్ల కోసం, పదవుల కోసం ఏమి జరగక ముందే ఖమ్మం కాంగ్రెస్ కొట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు. మత కలహాలు సృష్టించి ఎంతకైనా దిగజార్చే పరిస్థితి కాంగ్రెస్ ద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ హైకమాండ్ ఢిల్లీ ఉండే, ఇప్పుడు బెంగళూరు అయ్యింది. మాకు హైకమాండ్ ప్రజలేన‌న్నారు.

ఖమ్మం కరుణ కేసీఆర్, బి ఆర్ ఎస్ పై ఉండాలన్నారు. సీతారామ పథకం పనులు చివరి దశలో ఉంద‌ని తెలిపారు. ఇక్కడి ప్రాంతం సస్య శమలం కావాలంటే కేసీఆర్ ను దీవించండని అభ్య‌ర్ధించారు. సీతారామ పూర్తి అయితే కరువు అనే పదం డిక్షనరీలో ఉండదన్నారు. వచ్చే వానాకాలం నాటికి కృష్ణాలో నీళ్ళు ఉన్నా, లేకున్నా గోదావరి జలాలు వస్తాయన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతమైన‌ ఏపీలో క్రాప్ హాలిడే ప్రకటించారు. సీఎం కి ఖమ్మం పై ప్రత్యేక ప్రేమ. నాడు ఉద్యమ సమయంలో ప్రజలు గుండెకు హత్తుకున్నారు. అందుకే ఖమ్మం కరువు తొలగించాలని సీఎం కోరిక అని తెలిపారు.

Next Story