కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీఆర్ఎస్‌ కీలకం కానుంది: హరీశ్‌రావు

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్‌ కీలకం కానుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు.

By Srikanth Gundamalla  Published on  24 July 2023 11:21 AM IST
Minister Harish Rao, BRS, Telangana, BJP,

కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు బీఆర్ఎస్‌ కీలకం కానుంది: హరీశ్‌రావు

రానున్న పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత కేంద్రంలో బీఆర్ఎస్‌ కీలకం కానుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీఆర్ఎస్ భాగస్వామ్యం లేకుండా ప్రభుత్వం ఏర్పడే అవకాశమే ఉండదని చెప్పారు. 2024లో ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దె దించుతామని అన్నారు. ఆ తర్వాత కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం నుంచి తెలంగాణకు కావాల్సిన అన్ని నిధులను తీసుకొస్తామని మంత్రి హరీశ్‌ రావు చెప్పారు.

సిద్దిపేట మెట్రో గార్డెన్‌లో నిర్వహించిన రాష్ట్రస్థాయి అంగన్‌వాడీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వచ్చే పార్లమెంట్‌ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు కేంద్రంలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నా.. కచ్చితంగా సీఎం కేసీఆర్ మద్దతు కావాల్సి ఉంటుందని అన్నారు. బీఆర్ఎస్ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కుదరదని అన్నారు. అయితే.. ఇన్ని రోజుల నుంచి తెలంగాణకు నిధులు ఇవ్వకుండా బీజేపీ ఇబ్బందులు పెట్టిందని అన్నారు. అందుకే బీజేపీ కేంద్రం నుంచి గద్దె దించుతామని స్పష్టం చేశారు. తద్వారా ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం నుంచి తగినన్ని నిధులు, ఇప్పటి వరకు ఇవ్వాల్సిన నిధులు, వాటికి వడ్డీ కూడా వసూలు చేస్తామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.1.10 లక్షల కోట్లను బీజేపీ ప్రభుత్వం రెండేళ్లుగా నిలుపుదల చేసిందని.. తెలంగాణపై కక్ష్య పూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.

అంగన్‌వాడీల వేతనాల విషయాన్ని కూడా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. కొన్ని పార్టీలు అంగన్‌వాడీలను అడ్డం పెట్టుకుని బలం చూపించుకునే ప్రయత్నాలు చేస్తాయి.. అది మీరే తెలుసుకోవాలని అన్నారు. రోడ్డుమీదకు తీసుకొస్తారని అన్నారు. వారి ఉచ్చులో పడొద్దని అంగన్‌వాడీలకు సూచించారు మంత్రి హరీశ్‌రావు. సీఎం కేసీఆర్ అందరి కోసం ఆలోచిస్తారని.. ఎవరికీ అన్యాయం చేయరని చెప్పారు. రాజకీయాల కోసం వాడుకునే వారివైపు వెళ్లొద్దని హరీశ్‌రావు అన్నారు. మీరంతా మా కుటుంబ సభ్యులు.. మీ ప్రభుత్వం.. మమ్మల్ని దీవిస్తే కంటికి రెప్పలా కాపాడుకుంటామని హరీశ్‌రావు అంగన్‌వాడీలతో చెప్పారు.

తెలంగాణలో పాలన యావత్‌ దేశానికే ఆదర్శమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ప్రజలు కూడా తెలంగాణ తరహా పథకాలు కోరుకుంటున్నారని చెప్పారు. అంతేకాదు.. సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు అయితే తెలంగాణలో విలీనం అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని గుర్తుచేశారు. రైతుబంధు, 24 గంటల విద్యుత్‌ వంటి పథకాలు బీజేపీ పపాలిత రాష్ట్రాల్లో లేవని.. వీటి కోసం ఆయా ప్రభుత్వాలను ప్రజలే నిలదీసి అడుగుతున్నారని మంత్రి హరీశ్‌రావు చెప్పారు.

Next Story