మాపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజ నిజాలు తేల్చాలని అన్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నన్ను విచారణ కోసం హైదరాబాద్ రావాలని పిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. వాళ్ళు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి.. వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని.. విదేశీ పర్యటనలో ఉన్న నేను తిరిగి రావడం జరిగిందని తెలిపారు.
ఇదిలావుంటే.. మంత్రి గంగుల కమలాకర్ నివాస గృహాంతోపాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఐదు గ్రానైట్ కంపెనీల కార్యాలయాలలో ఈడీ, ఐటీ అధికారుల బృందాలు సోదాలు నిర్వహించాయి. కుటుంబంతో కలిసి దుబాయి పర్యటనకు వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్.. తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేసిన విషయాన్ని తెలుసుకున్న వెంటనే ఆయన తిరుగు ప్రయాణమయ్యారు. రాత్రికి కరీంనగర్ చేరిన ఆయన ఐటీ, ఈడీ అధికారుల దాడులపై స్పందించారు. గడచిన 30 ఏళ్లుగా తాను గ్రానైట్ వ్యాపారం చేస్తున్నానని తెలిపారు. అయితే ఏనాడూ తాను నిబంధనలు ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. తనపైనా, తన వ్యాపారాల పైనా చాలా మంది ఐటీ, ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు. దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకే తాను దుబాయి నుంచి తిరిగి వచ్చానని తెలిపారు.