తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ హుజురాబాద్ ఏరియా ఆస్పత్రిలో కరోనా టీకా వేయించుకున్నారు. దేశంలో రెండో దశ వ్యాక్సినేషన్ నేటి నుంచి అమలు చేస్తుండడంతో 45 నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నేటి నుంచి టీకా ఇస్తున్నారు. తెలంగాణలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ లేదన్నారు. అందరికి కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుందని, ఎటువంటి భయం అవసరం లేదని ఈటల అన్నారు. వాక్సిన్ తీసుకోవడం పట్ల ప్రజలు భయాందోళనకు గురికావద్దన్నారు. వ్యాక్సిన్ ప్రైవేట్ హాస్పిటల్స్‌లో కూడా అందుబాటులో ఉంటుందని ఈటల తెలిపారు.
తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ లేదని.. కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు నేటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో 45 సంవత్సరాలు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులు ఉన్న వాళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు ఈటల తెలిపారు. అలాగే, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్ అందుబాటులో ఉందని.. వాటిల్లో ఒక్క డోస్‌కి రూ.250 ధర ఉంటుందని తెలిపారు. వ్యాక్సిన్ పట్ల అపోహలు పెట్టుకోకూడదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 116 కరోనా కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం గత 24 గంటల్లో కరోనా మరణాలు సంభవించలేదు. అదే సమయంలో 165 మంది కోలుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,98,923 కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,95,387 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,634 గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 1,902 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 804 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 26 కరోనా కేసులు నమోదయ్యాయి.