తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పై అవినీతి ఆరోపణలు దుమారం రేపుతున్నారు. మెదక్ జిల్లా మూసాయిపేట మండలంలో భూ కబ్జాలకు పాల్పడ్డట్టు అక్కడి రైతులు ఆరోపిస్తున్నారు. ఈటలపై భూకబ్జా ఆరోపణలు రావడంపై సీఎం కేసీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చాలంటూ విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును సీఎం కేసీఆర్ ఆదేశించారు. కాగా, మంత్రి ఈటల భూకబ్జాల వ్యవహారాన్ని మెదక్ జిల్లా రిటైర్డ్ కలెక్టర్ ధర్మారెడ్డి వెలుగులోకి తెచ్చినట్టు సమాచారం. కాగా, తనపై వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు మంత్రి ఈటల మరికాసేపట్లో మీడియా ముందుకు వచ్చే అవకాశం ఉంది.
ఇదిలావుంటే.. హ్యాచరీస్ కోసం పేదలను, అధికారులను బెదిరింపులకు గురిచేసి మంత్రి ఈటల రాజేందర్ వందల ఎకరాలు ఆక్రమించినట్లుగా సంచలన ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు కేటాయించిన భూములను మంత్రి ఈటల రాజేందర్ బలవంతంగా స్వాధీనం చేసుకున్నట్లు గ్రామస్తులు ఆరోపించారు. పౌల్ట్రీ పరిశ్రమ ప్రారంభించేందుకు మంత్రి, అతని అనుచరులు తమ భూములను స్వాధీనం చేసుకున్నట్లు మసాయిపేట మండలంలోని అచంపేట, హకీంపేటకు చెందిన ఎనిమిది మంది గ్రామస్తులు ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.