మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజల ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై ఉన్న తిరుగులేని విశ్వాసానికి నిదర్శనమని శుక్రవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బ తీయడమే అజెండాగా పెట్టుకున్న శక్తులకు ఈ ప్రజా తీర్పు ఓ చెంప దెబ్బ అని వాఖ్యానించారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతూనే.. మరోవైపు అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు చేర్చాలన్న మా ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ఈ గెలుపు ప్రభుత్వంపై బాధ్యతను మరింత పెంచిందని, ఈ స్ఫూర్తితో తెలంగాణను అన్ని రంగాల్లోనూ ఇతర రాష్ట్రాలకు ధీటుగా అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేసి తీరుతామన్నారు. అబద్ధపు ప్రచారాలను నమ్మకుండా, అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు.. ఈ ఎన్నికల్లో విజయం కోసం ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మార్గ నిర్దేశనంలో, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో అహర్నిశలు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు.