ఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు
తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణశాఖ. శనివారం పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవగా.. ఇవాళ కూడా అదే పరిస్థితి ఉంటుందని అంచనా వేసింది.
By అంజి Published on 13 Aug 2023 10:18 AM ISTఏపీ, తెలంగాణలో మళ్లీ వర్షాలు
తెలంగాణకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇవాళ నల్గొండ, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సిద్ధిపేట జిల్లాల్లో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పారు. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణశాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్‌లో శనివారం ఉన్నట్లుండి వాతావరణం చల్లబడి వర్షం కురిసింది.
ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం స్థిరంగా కొనసాగుతున్నట్టు వాతావరణశాఖ తెలిపింది. వీటి ప్రభావంతో ఏపీలో రానున్న మూడు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని విపత్తు నిర్వహణ శాఖ స్పష్టం చేసింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, వెస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణ, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, కోనసీమ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయని స్పష్టం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో వారం పాటూ తేలికపాటి వర్షాలు కురుసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇవి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుగా ఉంటాయి. ఆగస్టు 15 తర్వాత పెద్ద వానలు కురిసే అవకాశం ఉంది. గత కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉక్కబోతతో భిన్నమైన వాతావరణం నెలకొంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడకపోవడంతో రైతులు వరుణుడి కోసం ఎదురుచూస్తున్నారు. బాగా ఎండలు మండిపోతుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.