మంచిర్యాల జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న ఏడుగురు మహిళా ఉపాధ్యాయులకు మెమో జారీ అయింది. ప్రభుత్వ బాలుర హైస్కూల్‌లో మహిళ ఉపాధ్యాయులు.. టీఆర్ఎస్ పాటలు పెట్టుకుని నృత్యాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపిన జిల్లా విద్యాశాఖ అధికారి వారికి మోమో జారీ చేశారు.
ప్రభుత్వం పీఆర్సీని ప్రకటించినందుకు గాను ఈనెల 22న పీఆర్టీయూ ఆధ్వర్యంలో జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సభావేదికపై మహిళ ఉపాధ్యాయులు టీఆర్‌ఎస్ పార్టీ పాటలకు నృత్యాలు చేశారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై.. నృత్యాలు చేసిన ప్రభుత్వ టీచర్స్‌ను సస్పెండ్ చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు కలెక్టరేట్ ఏఓకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి.. అధికార పార్టీ పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ వీడియోలను చిత్రీకరించారని.. ఈ విషయమై సమగ్ర విచారణ చేపట్టి ఉపాధ్యాయులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నేతలు డిమాండ్ చేశారు.