రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అంతే కాదు, కొత్త రేషన్ కార్డులు మాత్రమే కాకుండా ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేరు మార్పులు, చిరునామా మార్పులు, ఇతర మార్పులు అవసరమైనా వాటిని కూడా ఆన్‌లైన్ ద్వారా సులభంగా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ ప్రక్రియను మరింత సరళతరం చేసేందుకు ప్రభుత్వం మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్‌లైన్ దరఖాస్తును అందుబాటులోకి తెచ్చింది. ప్రజలు తమ సమీపంలోని మీ సేవ కేంద్రాలను సందర్శించి అవసరమైన మార్పులు, కొత్త దరఖాస్తులను చేసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
ఇదిలావుంటే.. కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటికీ కొనసాగుతుందని, దీనికి ఒక నిర్దిష్టమైన గడువు లేదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వివరించింది. ప్రభుత్వం చేపట్టిన ఈ నిర్ణయంతో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి భారీ ఊరట లభించనుంది.