మీ సేవా ఆపరేటర్ దారుణ హత్య ఇప్పుడు పెద్దపల్లి జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. రామగుండ మండలం మల్యాలపల్లి శివారులోని ఎన్టీపీ కూలింగ్ టవర్ దగ్గర కాంపల్లి శంకర్‌ను గుర్తు తెలియని దుండుగులు అతి దారుణంగా హతమార్చారు. ఎన్టీసీపీ కాజిపల్లికి చెందిన కాంపల్లి శంకర్ మీ సేవా ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. రాజీవ్ రహదారి పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. శంకర్‌ను చంపిన తర్వాత అతడి మృతదేహాన్ని రెండు ముక్కలుగా చేశారు. ఘటనా స్థలంలో మృతుడి తల, చేతులు దొరకగా మొండెం ఆచూకీ దొరకలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే శంకర్ భార్య ఈ హత్యకు పాల్పడిందంటూ మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. ఈ మేరకు శంకర్ భార్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిందితులను రెండు రోజుల్లో పట్టుకుంటామని రామగుండం సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ దారుణ హత్యలో తల, చేతులు మాత్రమే దొరకడంతో స్థానికులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. శంకర్‌ని హత్య చేయడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.